కంటెంట్ ఉన్నప్పుడు ఛాలెంజ్ ఎందుకు

చిన్న సినిమాలకు ఉన్న అతి పెద్ద సమస్య ఓపెనింగ్స్ తెచ్చుకోవడం. ప్రమోషన్ టైంలో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వకపోతే జనం థియేటర్లకు రావడం లేదు. ఆ మధ్య రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడు సాయిలు కంపాటి ఇచ్చిన స్టేట్ మెంట్ ఎంతో కొంత వర్కౌట్ అయ్యింది. అర్జున్ రెడ్డి రేంజ్ లో శపథం చేశారు. లక్కీగా అది హిట్టయిపోయి సేఫ్ అయ్యారు కానీ లేదంటే ఎక్కడికి వెళ్లినా ఆ ప్రశ్నను ఎదురుకోవాల్సి వచ్చేది. తాజాగా సహ హీరోయిన్ శ్వేత అదే రూటులో వెళ్ళింది.

సెప్టెంబర్ నాలుగున విడుదలయ్యే తమ సినిమా కనక మిమ్మల్ని నిరాశపరిస్తే అమీర్ పేట్ సెంటర్ లో గుండు చేయించుకుంటానని చెప్పడం ఒక్కసారిగా మీడియాతో పాటు అక్కడున్న వాళ్ళను షాక్ కి గురి చేసింది. మాములుగా ఎవరైనా అబ్బాయి ఈ మాట అంటే అంతగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే జెంట్స్ విషయంలో జుత్తు అనేది మాములు విషయం కాబట్టి. కానీ ఆడవాళ్ళకు అదే ప్రధాన అలంకారం. అలాంటిది వదులుకోవడం అంటే సాహసమే.

కంటెంట్ బాగుంటే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అందులో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఈ విషయంలో ముందుంటారు. ఇరుముడిని నెత్తినబెట్టుకున్న వాళ్ళే ఇదే రవితేజ గత సినిమాలను డిజాస్టర్ చేయడం మర్చిపోగలమా. ఫైనల్ గా మాట్లాడాల్సింది సినిమా తప్ప మనం కాదు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ రికార్డులు సాధించిన సినిమాల నటీనటులు చాలా బాలన్స్ గా మాట్లాడతారు తప్పించి మైకు ముందు ఇలా శపధాలు చేసేయరు.

ఇది తప్పా అంటే తప్పు అనలేం. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతోనో లేదా ఇలా మాట్లాడితే నలుగురి దృష్టిలో పడి చిన్న సినిమాకు బజ్ వస్తుందన్న ఉద్దేశంతోనో మాట్లాడింది కాబట్టి ఫలితం పాజిటివ్ గా వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందిన సహ మీద ముందు నుంచి కొంచెం డీసెంట్ బజ్ అయితే ఉంది. మంచి పోటీలో వస్తోంది కనక టాక్ యునానిమస్ గా రావాలి. అదే జరిగితే శ్వేత ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం పడదు. చూడాలి మరి ఏం రిజల్ట్ వస్తుందో.