ఈ వారం ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’తో పాటుగా తెలుగులో ‘కికు చిరంజీవి’ అనే ఓ చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోషన్ పరంగా ఎవ్వరూ సహకరించడం లేదంటూ ఇటీవల ప్రెస్ మీట్లో టీం బాధ పడింది.
‘టాక్సిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన మల్లారెడ్డి కళాశాలలో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదని.. అలాగే ఒక మల్టీప్లెక్సులో తమ సినిమా పోస్టర్ తీసి పక్కన పడేసి ‘టాక్సిక్’ది పెట్టారంటూ హీరో కమ్ ప్రొడ్యూసర్ కికు చిరంజీవి బాధ పడ్డాడు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ కశిష్ ఖాన్ పాల్గొనకపోవడం మీద నిర్మాత దీప్తి నిడిమింటి కాస్త సంచలనాత్మకంగా మాట్లాడారు. హీరోయిన్ ఎందుకు ప్రమోషన్లకు హాజరు కావడం లేదంటే.. ఇందులో దాచేదేమి లేదంటూ ఆమె తమ టీంను ఎంతగా ఇబ్బంది పెట్టిందో వివరించింది దీప్తి.
కశిష్ ఖాన్ ‘కికు చిరంజీవి’ కంటే ముందు రెండు సినిమాల్లో నటించిందని.. కానీ అవి ఆడలేదని, అలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలో అవకాశం ఇచ్చామని దీప్తి చెప్పింది. ఈ సినిమాకు తమతో పాటు ఆమెకూ చాలా అవసరమని.. కానీ కొంత షూట్ జరిగాక కశిష్ ఖాన్ తమను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిందని ఆమె చెప్పింది. తమ సినిమా వర్కింగ్ డేస్, బడ్జెట్ కొంచెం పెరిగాయని.. అయినా సరే తాము ఇబ్బంది పడుతూ కూడా దశల వారీగా హీరోయిన్‌కు పారితోషకం క్లియర్ చేస్తూ వచ్చామని ఆమె తెలిపింది. ఐతే చివరి దశలో కశిష్ కారవాన్ దిగకుండా.. పేమెంట్ ఇస్తేనే షూటింగ్ చేస్తా అంటూ తమకు చుక్కలు చూపించినట్లు దీప్తి వెల్లడించింది.
ఆమె ప్రమోషన్లకు కూడా హాజరై, ప్రిమియర్ షో పడ్డాక బ్యాలెన్స్ లక్ష ప్లస్ పేమెంట్ ఇవ్వడానికి సరే అన్నామని.. అగ్రిమెంట్ కూడా అలాగే జరిగిందని.. కానీ ముందు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్లకు వస్తా అని ఆమె పట్టుబట్టిందని దీప్తి తెలిపింది. ప్రమోషన్లకు రాని నేపథ్యంలో ఆమెకు మిగతా డబ్బులు ఇవ్వట్లేదని.. ఆ మొత్తాన్ని తిరుమల హుండీలో వేస్తామని ఆమె చెప్పారు. తమ సినిమా గుండెకు సంబంధించిన కథతో తెరకెక్కిన నేపథ్యంలో.. టీటీడీ వాళ్లు గుండె జబ్బులతో బాధ పడే చిన్నారుల కోసం నడిపే కార్యక్రమానికి ఈ డబ్బులు వినియోగించాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates