లోకేష్ కనకరాజ్‌కు ఇది తగునా?

మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాడతను. వివాదాలకు దూరంగా ఉండే ఈ హీరో.. తనకు ఒక సినిమా టీం నుంచి ఇబ్బంది ఎదురైతే, దాని మీద వివాదం చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. గతంలో తమిళంలో ‘నేరం’ సినిమాలో నటించిన నివిన్.. చాలా గ్యాప్ తర్వాత ‘బెంజ్’ మూవీలో నటించడానికి అంగీకరించాడు.

లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్శ్’లో భాగం కావడంతో అనౌన్స్ చేసినపుడే మంచి హైప్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రాన్ని ప్రకటించిన రెండేళ్లు కావస్తుండగా.. ఇప్పటికీ సినిమా రెడీ కాలేదు. అసలు షూటింగ్ ఎంత మేర జరిగిందన్నదీ సందేహమే. ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డదీ నివిన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘బెంజ్’ సినిమాలో తన పాత్ర కోసం గడ్డం పెంచానని.. ఆ సినిమా షూటింగ్ కోసమని గడ్డం తీయకుండా అలాగే ఉంచానని.. దీంతో తాను నటించే వేరే చిత్రాల కోసం కూడా ఆ గడ్డాన్ని అలాగే ఉంచాల్సి వచ్చిందని నివిన్ తెలిపాడు. ‘బెంజ్’ సినిమాలో తన పాత్రపై చిత్రీకరణ జరగడానికి ముందే తన మలయాళ సినిమాలు రెండు రిలీజయ్యాయని.. ‘బెంజ్’ కోసం పెంచిన గడ్డంతోనే ఆ సినిమాల్లో కనిపించాల్సి వచ్చిందని అతను తెలిపాడు.

తనకు ఇంకో నెల రోజుల సమయం ఉందని.. ‘బెంజ్’ టీం ఆ సినిమా సంగతేంటో తేల్చాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని నివిన్ అన్నాడు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఇలా వినమ్రంగా తన ఇబ్బందిని నివిన్ తెలియజేయడం తన హుందాతనానికి నిదర్శనం.

భాగ్యరాజ్ కన్నన్ ‘బెంజ్’ మూవీకి దర్శకుడు కాగా.. లోకేష్ కనకరాజ్ స్క్రిప్టు అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా ఎందుకింత ఆలస్యం అవుతోందో కానీ.. నివిన్ లాంటి కమిట్మెంట్ ఉన్న నటుడిని ఇబ్బంది పెట్టడం మాత్రం తప్పే. కాబట్టి లోకేష్ అండ్ టీమ్ నివిన్ సేవలను సరిగ్గా ఉపయోగించుకుని ఈ సినిమాను త్వరగా పూర్తి చేస్తే మంచిది. కొన్నేళ్లు వరుస ఫ్లాపులతో సతమతం అయిన నివిన్.. గత ఏడాది ‘సర్వం మాయ’తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇటీవలే ‘బెత్లెహాం కుడుంబ యూనిట్’తో మరో మంచి విజయాన్నందుకున్నాడు.