అందరూ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే డిసెంబర్ కూడా క్రేజీ సినిమాలతో పీక్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలా ఉంది. పండక్కు క్లాష్ చేసుకుని వసూళ్లు తగ్గించుకోవడం కన్నా సంవత్సరం చివరిలో వచ్చి హిట్టు కొట్టేసుకునే ప్లాన్ లో ఒక్కొక్కరుగా తోడవుతున్నారు. ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 4 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా మూడు నెలలే సమయం ఉండటంతో దర్శకుడు హను రాఘవపూడి చివరి షెడ్యూల్స్ పూర్తి చేసేందుకు టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నారు.
క్రిస్మస్ లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 24 ‘బాలయ్య 111’ రావడం దాదాపు పక్కానే. గాయం వల్ల బాలకృష్ణ ఇంకా విశ్రాంతిలోనే ఉన్నప్పటికీ సెప్టెంబర్ నుంచే సెట్స్ లో అడుగు పెడతారని టాక్. అదే జరిగితే దర్శకుడు గోపీచంద్ మలినేని అనుకున్న టైంకి అవుట్ ఫుట్ సిద్ధం చేస్తారు. నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ని నెలాఖరులో దించే ఆలోచన ఉందట. మాస్, మన్మథుడు లాంటి సూపర్ హిట్స్ నాగ్ కు ఈ టైంలోనే కలిసి వచ్చాయని ఫ్యాన్స్ సెంటిమెంట్ గా ఫీలవుతారు.
ఇక్కడితో అయిపోలేదు. స్లాట్ కోసం వెతుకుతున్న నాగ చైతన్య ‘వృషకర్మ’ అదే నెల వైపు చూస్తోంది. అయితే చైతు తన తండ్రితో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి కనీసం రెండు వారాలు గ్యాప్ తీసుకోవాలి. బాలయ్య కనక ఏదైనా కారణాల వల్ల తప్పుకుంటే ఆ స్లాట్ ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ, రాపో 23 వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. వీటికి తోడు షారుఖ్ ఖాన్ ‘కింగ్’ ప్యాన్ ఇండియా భాషల్లో డిసెంబర్ 25 విడుదలకు రెడీ చేస్తున్నారు.
ఇక్కడ చెప్పినవాటిలో ఒక్క ఫౌజీ, కింగ్ మాత్రమే అఫీషియల్ గా డేట్స్ లాక్ చేసుకున్నాయి. మిగిలినవి తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నాయి. జనవరిలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ముందుగానే వచ్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అసలే జూన్ నుంచి నెలకు రెండు మూడు హిట్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. ఇది వచ్చే సంక్రాంతి వరకు ఇలాగే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఆసక్తికంగా మారుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates