ఇరుముడి పాప… ఇక్కడా కన్నీళ్లే

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’లో కథాకథనాలన్నీ ఒకెత్తయితే.. వివిధ పాత్రలకు ఎంచుకున్న కాస్టింగ్, ఆ క్యారెక్టర్లలో నటీనటుల పెర్ఫామెన్స్ ఇంకో ఎత్తు. హీరో హీరోయిన్ రవితేజ, ప్రియ భవానీ శంకర్‌లకు తోడు అందరూ తమ పాత్రకు బాగా సూటయ్యారు. చక్కగా పెర్ఫామ్ చేశారు. ఐతే పెద్ద పెద్ద ఆర్టిస్టులను మించి ఈ చిత్రంలో క్యారెక్టర్, పెర్ఫామెన్స్ పరంగా హైలైట్ అయింది రవితేజ కూతురు మణికంఠ పాత్రలో నటించిన బేబి నక్షత్ర అనడంలో సందేహం లేదు.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. కఠిన హృదయులు కూడా ఈ సినిమా చూస్తే తన పాత్ర, నటన చూసి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. ఆ పాత్ర అంత బాగా పండింది. నక్షత్ర కూడా అంత గొప్పగా నటించింది. ఐతే నక్షత్ర రియల్ స్టోరీ ఏంటో తెలిస్తే.. ‘ఇరుముడి’ షూటింగ్ సందర్భంగా నక్షత్రతో తనకు ఎదురైన అనుభవం గురించి దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన వీడియో చూస్తే రియల్‌గానూ కన్నీళ్లు వస్తాయంటే అతిశయోక్తి కాదు.

తండ్రిని ప్రాణంగా ప్రేమించే కూతురి పాత్రలో నటించిన నక్షత్రకు నిజ జీవితంలో తండ్రి లేడట. తనకిప్పుడు 12 ఏళ్లు కాగా.. చిన్నపుడే తండ్రిని కోల్పోయిందట. తల్లే అన్నీ తానై ఈ మలయాళ అమ్మాయిని చూసుకుంటోందట. నక్షత్రకు తండ్రి లేడన్న విషయం ముందు తనకు తెలియదని.. ‘ఇరుముడి’లో ఒక ఎమోషనల్ సీన్ గురించి నక్షత్రకు వివరిస్తూ.. నీ తండ్రికి నిజంగా ఇలా జరిగితే ఎలా ఊహిచుకుని నటించి అని చెబితే.. ‘‘నాకు తండ్రి లేడు’’ అంటూ నక్షత్ర చెప్పిందని.. దీంతో ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాలేదని ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో శివ నిర్వాణ చెప్పి పాస్ ఇవ్వగా.. ఆడిటోరియం ఒక్కసారిగా మూగబోయి, అందరికీ కళ్లలో నీళ్లు తిరిగాయి.

తర్వాత శివ కొనసాగిస్తూ.. ఆ టైంలో తాను ఎమోషనల్ అయితే పాప కూడా ఎమోషనల్ అవుతుందేమో అని, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లు క్యాజువల్‌గా ఉండి ఆ సీన్ చేయించుకున్నానని తెలిపాడు. మామూలుగా సెట్లో చిన్నపిల్లలతో షూటింగ్ చేయిస్తే.. వారి తల్లిదండ్రులు ఎన్నో కండిషన్లు పెడతారని.. వాళ్ల కంఫర్ట్ కోసం చూస్తారని.. కానీ నక్షత్ర తల్లి మాత్రం తమకు పాపను అప్పగించేసి మీ ఇష్టం అన్నట్లు వదిలేసిందని.. అలాగే నక్షత్ర కూడా ఎన్ని టేక్స్ అయినా ఓకే అన్నట్లు సహకరించేదని.. తనది అంత గొప్ప పెంపకం అంటూ శివ కొనియాడాడు.