పాలు అమ్మాను… అనే పెద్దాయన చిన్న సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదు

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే విధానం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇప్పుడు ‘కికు చిరంజీవి’ అనే సినిమా హీరో కూడా తన మాటలతో వైరల్ అవుతున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో కికు యనమల సినిమా ప్రమోషన్స్ సమయంలో తనకు ఎదురైన కొన్ని విషయాలు చెప్పాడు. కొత్త సినిమా కావడంతో ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి చాలా చోట్ల తిరిగామని, ఆ ప్రయాణంలో కొన్ని అనుభవాలు బాధించాయని చెప్పుకొచ్చాడు.

ముందుగా థియేటర్ పోస్టర్ విషయం ప్రస్తావించాడు. తన సినిమా పోస్టర్ చూడాలని ఒక థియేటర్‌కు వెళ్లగా, అక్కడ అది తీసేసి ‘టాక్సిక్’ పోస్టర్ పెట్టారని తెలిపాడు. అది ‘టాక్సిక్’ టీమ్ చేసిన పని కాదని, థియేటర్ వాళ్లే మార్చారని స్పష్టం చేశాడు. తన పోస్టర్‌ను పక్కన పెట్టినా పర్లేదని, పూర్తిగా తీసేయడం మాత్రం బాధ కలిగించిందని అన్నాడు.

కాలేజ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పాడు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కాలేజ్‌లో ఈవెంట్‌కు ముందుగా అనుమతి వచ్చిందట. తర్వాత ఏపీ టూర్ పూర్తి చేసుకుని తిరిగి సంప్రదించగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. కొన్ని వందల మంది విద్యార్థుల ముందు మాట్లాడే అవకాశం దొరికినా తమ సినిమాకు ఉపయోగపడేదని అన్నాడు.

ఇటీవల అదే వేదికలో ఒక భారీ సినిమా ఈవెంట్ జరిగిన విషయాన్ని కూడా కికు పరోక్షంగా గుర్తుచేశాడు. ఆ ఈవెంట్‌లో సంస్థకు చెందిన పెద్దాయన తాను “పూలు అమ్మినా, పాలు అమ్మినా.. కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను” అని చెప్పిన మాటలు గుర్తున్నాయని అన్నాడు. అలాంటి కష్టం తెలిసిన వ్యక్తి తమలాంటి కొత్త వాళ్ల ప్రయత్నాన్ని కూడా అర్థం చేసుకుంటారని అనుకున్నానని, కానీ చిన్న ఈవెంట్‌కు అవకాశం దొరకలేదని తన బాధను చెప్పాడు. 

అయితే కాలేజ్ పేరు గానీ, ఆ పెద్ద సినిమా పేరు గానీ నేరుగా ప్రస్తావించలేదు. ఇక సినిమా కోసం సీనియర్ నటులు ఇచ్చిన సపోర్ట్‌ను కూడా కికు గుర్తుచేశాడు. అలీ, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు ప్రమోషనల్ వీడియోలు చేసి సహాయం చేశారని చెప్పాడు.