ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు వెళ్లిపోవడం గురించే ఉంది. ఇంత బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తూ ఏబీసి సెంటర్ తేడా లేకుండా ప్రతి చోటా ఊచకోత కోస్తున్న టాలీవుడ్ సినిమాకు కౌంట్ తగ్గించి, ఒక కన్నడ డబ్బింగ్ మూవీకి ఎలా ఇస్తారనే దాని మీద తెలుగు యువత ఆన్ లైన్ లో యుద్ధాలు చేసినంత పనికి సిద్ధపడింది. రవితేజకు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ తాలూకు పరిణామమిది.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆగస్ట్ 21 ఇరుముడి రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు ముందు టాక్సిక్ లేదు. కేవలం అయిదు రోజుల గ్యాప్ లో ఆగస్ట్ 26 మేం వస్తున్నామని ప్రకటించినప్పుడు మైత్రి వెనుకడుగు వేయలేదు. ఒకవేళ రవితేజ పోషించిన త్రినాధ్ పాత్ర తాలూకు ఇంపాక్ట్ బాక్సాఫీస్ మీద ఈ స్థాయిలో ఉంటుందని బహుశా అంచనా వేయలేదేమో. హిట్ అవుతుందని భావించి ఉండొచ్చు కానీ ఇంతగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందని అంత అనుభవమున్న నిర్మాతలు ఊహించి ఉండరు.
బిజినెస్సులు ఈగోలు రాజ్యమేలే పరిశ్రమలో సెంటిమెంట్ల కన్నా వ్యాపారానికే ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. టాక్సిక్ హక్కులను భారీ మొత్తానికి కొన్న ఎస్విసి వెర్షన్ మరోలా వినిపిస్తోంది. అంత భారీ మొత్తంలో హక్కులు కొన్నప్పుడు అది రికవరీ కావాలంటే మా శక్తి మేరకు రిలీజ్ చేసుకుంటాం తప్ప అవతలి వాళ్ళ కోసం త్యాగాలు ఎలా చేస్తామనేది అటు నుంచి వినిపిస్తున్న మాట. కానీ టాలీవుడ్ కు వీలైనంత మద్దతు ఇవ్వాలనేది నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్.
సరే చివరికి ఎవరిది ఆధిపత్యం అవుతుందనేది పక్కన పెడితే టాక్సిక్ తో ఇలాంటి క్లాష్ కన్నా ఒక వారం ముందు విశ్వనాథ్ అండ్ సన్స్ తో పోటీ పడి ఉంటేనే బాగుండేదనే అభిప్రాయాలు మాస్ మహారాజా ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. లేక లేక తమ హీరో హిట్టు కొడితే ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు దారి ఇవ్వడం కోసం తన ఈగల్ ని త్యాగం చేసిన 2023 ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చూడాలి ఇంకేం జరుగనుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates