మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే ఎవ‌రో ఒక‌రి గురించి త‌ర‌చుగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. హృతిక్ రోష‌న్, క‌ర‌ణ్ జోహార్ స‌హా స‌హా చాలామందిని ఆమె టార్గెట్ చేయ‌డం గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్లో ఆమెకు అస్స‌లు న‌చ్చ‌ని వాళ్ల‌లో తాప్సి ప‌న్ను కూడా ఒక‌రు.

ఐతే తాప్సి త‌న‌కు తానుగా ఎప్పుడూ కంగ‌న జోలికి వ‌చ్చింది లేదు. ఐతే క్వీన్ సినిమాతో తాను బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒక‌ ట్రెండ్ సెట్ చేస్తే.. తాప్సి త‌ర్వాత అలాంటి సినిమాలే చేసి పాపుల‌ర్ కావ‌డం కంగ‌నకు న‌చ్చ‌లేదు.

తాప్సి త‌న‌ను కాపీ కొడుతోందంటూ ఆమెను ఎప్ప‌ట్నుంచో టార్గెట్ చేస్తూనే ఉంది కంగ‌న‌. ఐతే ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో కంగ‌న‌తో గొడ‌వ గురించి తాప్సిని అడిగితే.. ఆమె కూడా కొంత వివాదాస్ప‌దంగానే మాట్లాడింది. కంగ‌న గురించి తాను స్పందించడం అన్న‌ది త‌న పెంప‌కం, త‌న మాట‌తీరును బ‌ట్టి ఉంటుంద‌ని.. ఎవ‌రు ఎక్క‌డి నుంచి వ‌చ్చార‌న్న‌దాన్ని బ‌ట్టి వాళ్లు మాట్లాడ‌తార‌ని న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడింది. ప‌రోక్షంగా కంగ‌న విష‌యంలో నోరు జార‌కుండా త‌న పెంప‌కం అడ్డు ప‌డుతోంద‌ని.. కానీ ఆ సంస్కారం కంగ‌న‌కు లేద‌న్న‌ట్లుగా తాప్సి వ్యాఖ్యానించింది.

ఐతే తాప్సి ఏమీ మాట్లాడ‌కుండానే ఆమె మీద విరుచుకుప‌డే కంగ‌న.. త‌న మీద ఇలాంటి కౌంట‌ర్లు వేస్తే ఊరుకుంటుందా? తాజాగా మ‌రోసారి తాప్సి మీద ఆమె విరుచుకుప‌డింది. తాప్సిని స‌స్తి కాపీ (చీప్ కాపీ) అని అభివ‌ర్ణిస్తూ.. రాబోయే త‌న బి-గ్రేడ్ మూవీ ప్ర‌మోష‌న్ కోసం ఎప్ప‌ట్లాగే త‌న పేరును వాడుకుంటోంద‌ని విమ‌ర్శించింది కంగ‌నా.

త‌న పెంప‌కం గురించి, త‌ల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హ‌త తాప్సికి లేద‌ని విమ‌ర్శిస్తూ.. ప్ర‌తి త‌ల్లిదండ్రులూ త‌మ పిల్ల‌ల కోసం ఉత్త‌మంగా చేయాల్సిందంతా చేస్తార‌ని.. తాను ఎప్పుడూ ఏ వాద‌న‌లోకీ ఎవ‌రి త‌ల్లిదండ్రుల పేర్లు తీసుకురాన‌ని ఆమె అంది. తాప్సి త‌ల్లిదండ్రులు త‌న లాంటి ఒరిజిన‌ల్ న‌టికి జ‌న్మ‌నివ్వ‌లేక‌పోయినందుకు జాలేస్తోంద‌ని పేర్కొంటూ మ‌రోసారి తాప్సిని చీప్ కాపీ అని ఎద్దేవా చేసింది కంగ‌న‌. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌కు తాప్సి మ‌ళ్లీ స్పందిస్తుందా.. లేక కంగ‌న ఇంతే క‌దా అని లైట్ తీసుకుని వ‌దిలేస్తుందా అన్నది చూడాలి.