50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు  

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు రాజమౌళి. ఒకప్పుడు విక్రమార్కుడు లాంటి కమర్షియల్ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టడం నుంచి, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గడపకు టాలీవుడ్ ని తీసుకెళ్లిన ఘనత వరకు ఆయన సాధించిన మైలురాళ్ళు అన్ని ఇన్ని కావు. అందుకే వారణాసి మీద ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్.

వరల్డ్ వైడ్ రిలీజ్ విషయంలో రాజమౌళి చాలా ప్లాన్డ్ గా ఉన్నారని సమాచారం. 50 దేశాల్లో ఒకేసారి సమాంతరంగా విడుదల చేసేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారట. మాములుగా ఇప్పుడున్న టెక్నాలజీ వాడి ఏఐతోనే మహేష్ బాబు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడినట్టు చేయొచ్చు. కానీ కృత్రిమంగా అనిపిస్తుంది. అందుకే జక్కన్న అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్టులు సుమారు 1500 పైగా పిలిపించి త్వరలోనే ఆడిషన్లు నిర్వహించబోతున్నారని తెలిసింది.

గొంతులు ఏ ఏ ఆర్టిస్టుకు ఎవరెవరివి సెట్ అవుతాయో కాచి వడబోసి ఫైనల్ చేస్తారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని వందల మంది గొంతులు విని కన్ఫ్యూజ్ కాకుండా ఎంపిక చేసుకోవడం సవాల్ లాంటిది. అయినా రాజమౌళికి ఇలాంటివి కొత్త కాదు. ఒక్క రూపాయి అవుట్ పుట్ కోసం పది రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అంటారు. అఫ్కోర్స్ అది వంద రూపాయలు వసూలు చేయడం వేరే విషయం. అందుకే కాంప్రోమైజ్ అనే పదానికి చోటు ఉండదు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న వారణాసి దానికి అనుగుణంగానే పనులు జరుపుకుంటోంది. ప్రమోషన్ల విషయంలో రాజమౌళితో పాటు కార్తికేయ టీమ్ పక్కా ప్రణాళికతో ఉంది. ఈసారి ఆస్కార్ ని మరింత బలంగా టార్గెట్ చేసి ఎలాగైనా సాధించాలనే సంకల్పంతో వరల్డ్ క్లాస్ విజువల్స్ సిద్ధం చేస్తున్నారు. కీరవాణి సంగీతం సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. ఇండియన్ స్క్రీన్ ఇప్పటిదాకా ఎప్పుడూ చూడని ఒక విజువల్ ఫీస్ట్ కోసం యావత్ సినీ లోకం ఎదురు చూస్తోంది.