కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కొత్త చిరంజీవిని చూడబోతున్నామనే భావన కలిగింది. ఆక్వా ఫుడ్ ప్రాససింగ్ సూపర్ వైజర్‌ సత్యం పాత్రలో చిరు బాగా ఇంప్రెస్ చేశారు. ఈ గ్లింప్స్‌లో చాలా వరకు సామాన్యుడిలానే కనిపించారు చిరు. కానీ చివర్లో ఆ పాత్రలోని వైల్డ్ యాంగిల్ బయటికి వచ్చింది.

మన కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రల్లో ఇలాంటి షేడ్స్ ఉండడం కొత్తేమీ కాదు. ‘బాషా’ నుంచి ఈ ఫార్ములాను చూస్తూనే ఉన్నాం. ‘కాకా’ తీస్తోంది కమర్షియల్ సినిమాలకు పేరుపడ్డ బాబీ కొల్లి కాబట్టి.. ఇది మరీ ప్రయోగాత్మకంగా ఏమీ ఉండదని.. సగటు మాస్ మసాలా సినిమాలానే సాగొచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇటీవల చిరు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన బాబీ చెప్పిన మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

చిరు 90వ దశకంలో రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి భిన్నమైన, అద్భుతమైన కథల్లో నటించారని.. కానీ వాటిలో కమర్షియల్ టచ్ లేకపోవడం వల్ల అవి అనుకున్నంత బాగా ఆడలేదని.. తాను డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రంలో ఆ లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నానని అతను చెప్పాడు. ఇటు పెర్ఫామెన్స్, కథాబలం, వైవిధ్యంతో పాటు.. అటు కమర్షియల్ విలువలను కూడా జోడించి బ్యాలెన్సింగ్‌గా ఈ సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నట్లు అతను చెప్పుకొచ్చాడు.

ఐతే బాబీ నుంచి ఇలాంటి ప్రయత్నం ఊహించనిది. కమర్షియల్ సినిమాలు తీయడంలో మంచి నైపుణ్యం ఉన్న బాబీ నుంచి.. ప్రయోగాలు మాత్రం ఆశించలేం. అందులోనూ అతను ఏకంగా రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి సినిమాల పేర్లు ప్రస్తావించి.. అలాంటి కథలకు కమర్షియల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ‘కాకా’ ఉంటుందనడం ఒకింత అతిశయోక్తిలాగే అనిపించింది.

బాబీకి అలాంటి ప్రయోగాత్మక కథలను డీల్ చేసే సత్తా ఉందా.. పైగా వాటికి కమర్షియల్ టచ్ ఇవ్వడమా అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఐతే ‘డాకు మహారాజ్’లో స్టైలిష్ టేకింగ్‌తో తనలోని కొత్త కోణాన్ని చూపించిన బాబీ.. ఈసారి చిరు సినిమాను తాను చెప్పినంత వైవిధ్యంగా, బ్యాలెన్స్డ్‌గా తీసి మెప్పిస్తాడేమో చూడాలి. నిజంగా అతనలా చేయగలిగితే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఆకాశమే హద్దు.