ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు ప‌డ‌దు. ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల‌కు కూడా వేర్వేరుగా అభిమాన గ‌ణాలున్నాయి. వారి మ‌ధ్య కూడా ఫ్యాన్ వార్స్ జ‌రుగుతుంటాయి. ఈ అభిమానులు త‌మ హీరో సినిమాకు అనుకూలంగా ప‌ని చేయ‌డం కంటే అవ‌త‌లి హీరో సినిమాను దెబ్బ కొట్ట‌డానికి పెట్టే టైమే ఎక్కువ‌. అదే ప‌నిగా ఒక సినిమా గురించి యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్ర‌చారం చేయ‌డం మామూలైపోయింది. 

ఏ పెద్ద హీరో సినిమా వ‌చ్చినా.. ఈ ర‌క‌మైన నెగెటివిటీ ఈ మ‌ధ్య పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చాలా కొద్దిమంది హీరోలు ఈ నెగెటివిటీ బారిన ప‌డ‌కుండా త‌ప్పించుకుంటూ ఉంటారు. వారికి అంద‌రు హీరోల నుంచి ఆమోదం ఉంటుంది. ఆ కోవ‌కే చెందుతాడు మాస్ రాజా ర‌వితేజ‌. ఎంతో క‌ష్ట‌ప‌డి స్టార్‌గా ఎదిగిన అత‌డి ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో సానుకూల భావ‌న ఉంటుంది. వేర్వేరు హీరోల ఫ్యాన్స్ కూడా త‌న ప‌ట్ల అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

నాలుగేళ్లుగా స‌రైన విజ‌యం లేని ర‌వితేజ‌కు మంచి హిట్ ప‌డాల‌ని త‌న అభిమానులే కాదు, మిగ‌తా హీరోల ఫ్యాన్స్ కూడా బ‌లంగా కోరుకుంటుండ‌గా.. ఇరుముడి రూపంలో మాస్ రాజాకు అలాంటి విజ‌య‌మే ద‌క్కిన‌ట్లు క‌నిపిస్తోంది. శుక్ర‌వారం రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, టాక్ రాగా.. అవి అంత‌కంత‌కూ మ‌ల్టిప్లై అయ్యాయి. ఈ సినిమాకు ఎక్క‌డా అస‌లు నెగెటివిటీ అన్న‌దే క‌నిపించ‌డం లేదు. అంద‌రు హీరోల అభిమానులూ ఇరుముడి ప‌ట్ల చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ర‌వితేజ‌కు మంచి సినిమా ప‌డింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి అంద‌రూ త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే పాజిటివ్ టాక్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. సినిమాలో ఉన్న కంటెంట్‌కు మించి సినిమా విజ‌యం సాధించేలా క‌నిపిస్తోంది. శనివారం సాయంత్రం, రాత్రి షోల‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఇండ‌స్ట్రీనే షాక‌య్యే ప‌రిస్థితి. ఇరుముడి విజ‌యం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో అన్ని వైపులా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. ర‌వితేజ సినిమా హిట్ట‌యితే ఇంతమంది సంతోషిస్తారా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.