చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు ఇది అనుకోకుండా జరగ్గా.. అది ఒక సరదా అలవాటుగా మారడంతో ‘చిరు లీక్స్’ అంటూ ఒక కొత్త ట్రెండ్ కూడా మొదలైంది టాలీవుడ్లో. తనది ఏ కొత్త సినిమా మొదలైనా.. దాని విశేషాలను లీక్ చేసేస్తా అంటూ చిరు దర్శకులతో పరాచకాలు ఆడడం.. దాన్ని కూడా ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకోవడం చూశాం.

ఐతే ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో కూడా చిరు ఒక లీక్ చేయడం చూసి అదంతా అనుకోకుండా జరిగిందనే అనుకున్నారు జనం. కానీ ఈసారి ‘చిరు లీక్స్’ పేరుతో జనాలను భలేగా బోల్తా కొట్టించాడని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు చిరు లీక్ చేసిన తన కొత్త సినిమా టైటిల్‌‌కు, ఈ రోజు ప్రకటించిన పేరుకు సంబంధం లేదు.

‘కొరియన్ కనకరాజు’ ఈవెంట్లో చిరు.. బాబీ కొల్లి దరకత్వంలో చేసే సినిమా గురించి మాట్లాడుతూ.. ‘కదిరి’ అనే పదాన్ని ఉపయోగించి అంతలోనే నాలిక్కరుచుకున్నారు. దీంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ సినిమా టైటిల్లో ‘కదిరి’ అని ఉంటుందని అప్పుడు అందరూ ఫిక్సయిపోయారు. ‘కాకా’ అనే టైటిల్ ఇంతకుముందే ప్రచారంలోకి రాగా.. చిరు కొత్తగా ‘కదిరి’ అనే పదాన్ని వాడడంతో ఈ టైటిల్ ‘కదిరి కాకా’ అయ్యుంటుందని అంచనా వేశారు.

కానీ ఇప్పుడు చూస్తే జస్ట్ ‘కాకా’ అంటూ టైటిల్ అనౌన్స్ చేశారు. పైగా ఈ సినిమాలో హీరో పాత్ర ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సూపర్ వైజర్ అన్నట్లు చూపించడంతో అనంతపురం జిల్లాలోని కదిరితో ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదని.. ఈ స్టోరీ ‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే ఆంధ్ర ప్రాంతంలో కథ నడుస్తుందని అర్థమైంది. మొత్తానికి ఆ రోజు ‘కదిరి’ అంటూ జనాలను భలేగా బోల్తా కొట్టించాడని.. దీని వల్ల ‘చిరు లీక్స్’ క్రెడిబిలిటీ దెబ్బ తిందని.. ఇకపై చిరు ఏదైనా లీక్ చేస్తే అభిమానులు నమ్మడం కష్టమే అని చర్చించుకంటున్నారు సోషల్ మీడియాలో.