చిరంజీవి కాకా… అదిరింది కానుక  

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి కాకాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాల్తేరు వీరయ్య కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీ కొల్లి దీన్ని రూపొందిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అభిమానుల్లో పెద్ద ఎత్తున అంచనాలు రేపుతోంది. ఇవాళ చిరు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్ప్స్ అభిమానులకు బర్త్ డే కానుకగా ఇచ్చారు.

కథేంటో రివీల్ చేయలేదు కానీ జానర్ ఏంటనేది చెప్పేశారు. ఒక రొయ్యల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే సత్యం (చిరంజీవి) అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. పేరుకి యజమానే అయినా అందరితో పాటు కలిసి పోయి వృత్తే దైవంగా భావించే టైప్. కూతురు అమ్ము (అనస్వర రాజన్) అంటే ప్రాణం. బైక్ కీ చైన్ మీద ఐ లవ్ యు డాడ్ అని ఉంటుంది. అలాంటి సత్యం వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. గన్నులు, రక్తపాతం, శత్రువుల సమూహం ఉంటుంది. అదేంటనేది తెరమీద చూస్తేనే కిక్కు.

ఒక మాములు మిడిల్ క్లాస్ సెటప్ లో కనిపిస్తున్న చిరంజీవిని దర్శకుడు బాబీ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన వైనం విజువల్స్ లో ఉంది. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ రీమిక్స్ చేస్తూ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మూడు నిమిషాల వీడియో అయినప్పటికీ చిరు లుక్కు కేవలం మూడు షాట్లకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలినదంతా పెద్ద డీటెయిల్స్ లేకుండా ఫ్యాక్టరీ సెటప్, సునీల్, గెటప్ శీను తదితర ఆర్టిస్టుల పరిచయంతో లాగించేశారు.

జనవరి 13 కాకా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. వెంకటేష్ అనిల్ రావిపూడి దీనికన్నా ఒక రోజు ముందు జనవరి 12 రానున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యని మించి హిట్టివ్వాలనే సంకల్పంతో ఉన్న బాబీ కొల్లి ఈసారి ఎలాంటి కంటెంట్ ఇస్తాడోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపధ్యమే అయినప్పటికీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్, యాక్షన్ బ్లాక్స్ ని తనదైన శైలిలో హ్యాండిల్ చేసే బాబీ ఈసారి కాకాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కాక రేపుతారోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.