రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా ఉన్నా ఇప్పటికీ పాతికేళ్ల హుషారుతో వేగంగా సినిమాలు చేసే మాస్ మహారాజాకు గత కొంత కాలంగా తన స్థాయి హిట్టు పడటం లేదు. అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ తప్ప అంతకు మించిన ఫలితం దక్కితే ఒట్టు. అయితే ఇరుముడి విషయంలో ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. టైటిల్ నుంచి ప్రమోషన్స్ దాకా అన్నీ సానుకూలంగా ఉన్నాయి.

ఇరుముడి ఇవాళ థియేటర్లకు వచ్చేసింది. ఎర్లీ ప్రీమియర్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటం శుభ సూచకం. ఎంత పెద్ద హిట్టయినా ఏవో కొన్ని హెచ్చుతగ్గులు ఉండటం పరిపాటి. కానీ వాటి కన్నా ఎక్కువగా మంచి విషయాలే ఇరుముడి గురించి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. యుఎస్ లో చూసిన ఆడియన్స్ ఎవరూ నెగటివ్ గా చెప్పకపోవడం సంతోషించాల్సిన విషయం. మార్కెట్ లో ఎలాంటి కాంపిటీషన్ లేకుండా సింగల్ గా వచ్చిన ఇరుముడికి ఓపెన్ గ్రౌండ్ ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తీయడమనే సంగతి పక్కనపెడితే ఇరుముడికి దర్శకుడితో సహా ఏ ఇతర విషయమూ సూపర్ ఎగ్ జైటింగ్ గా లేకపోయింది. శివ నిర్వాణ గత చిత్రాలు పెద్దగా అద్భుతాలు చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ స్వంత ట్యూన్స్ చార్ట్ బస్టర్స్ అనిపించుకోలేదు. అయినా సరే ఇరుముడికి ఇంత  ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడటం విశేషమే. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కన్నా కూతురిగా నటించిన నక్షత్ర హైలైట్ కావడం గమనించాల్సిన విషయం.

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి కళగా ఉంది. స్ట్రెయిట్, డబ్బింగ్ పక్కన పెడితే పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ఒడిస్సి, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, విశ్వనాధ్ అండ్ సన్స్ మొదలైన సినిమాలు కొన్నవాళ్లందరికీ డబ్బులు ఇచ్చాయి. థియేటర్లు నిండుగా కనిపించాయి. కంటెంట్ మీద కంప్లయింట్స్ ఉన్న హుషారు పిట్టలు సైతం దాని రేంజుకు తగ్గట్టు బాగానే పే చేసింది. ఈ లెక్కన ఇరుముడి కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల మోత ఖాయం.