ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్ ఉన్న స్టార్ మన దగ్గర చిరంజీవి రూపంలో ఉన్నారు కానీ మోహన్ లాల్ వేగం చాలా స్పెషలని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాల లైనప్ ని అధికారికంగా ప్రకటించారు. దర్శకులు విష్ణు మోహన్, అనూప్ సత్యన్, ప్రియదర్శన్, దిలీప్ పోతన్, జీతూ జోసెఫ్, జూడ్ ఆంటోనీ జోసెఫ్, సత్యన్ లతో ఇవి తెరకెక్కబోతున్నాయి.

అభిమానులు కంప్లీట్ యాక్టర్ గా పిలిచే మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. మాములుగా ఈ వయసులో ఇంత శ్రమ తీసుకోనక్కర్లేదు. ఏడాదికి ఒకటి రెండు ఇచ్చినా సరిపోతుంది. కానీ లాలెట్టాన్ అవేవి పట్టించుకోవడం లేదు. ఎల్ 2 ఎంపురాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసినా, తుదక్కుమ్ లాంటి ఫామిలీ థ్రిల్లర్ లో నటించినా అన్నింటితో బ్లాక్ బస్టర్ కొట్టడం ఆయనకే చెల్లింది. దృశ్యం 3 మిశ్రమ స్పందనతో రెండు వందల కోట్ల మార్కు దాటడం మాములు విషయం కాదు.

ఈయన సంగతి పక్కనపెడితే న్యూ జనరేషన్ హీరోలు ఇలాంటి సీనియర్ల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విశ్వంభర ఆలస్యం అవుతోందని మెగాస్టార్ సైలెంట్ లేరు. మెగా 158 చకచకా పూర్తి చేసి సంక్రాంతి బరిలో పెడుతున్నారు. బాలయ్య ప్రమాదానికి గురైనా వేగంగా రికవరీ చేసుకుంటూ వచ్చే నెల నుంచే సెట్లో అడుగు పెడుతున్నారు. వెంకటేష్ అయిదు నెలల్లో రెండు సినిమాలు ఇస్తున్నారు. నాగార్జున బిగ్ బాస్ షోతో పాటు కింగ్ 100ని రెడీ చేస్తున్నారు.

కానీ ప్యాన్ ఇండియా ఉచ్చులో ఉన్న కొత్త తరం హీరోలు మాత్రం ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ కెరీర్ మొత్తం మీద కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయడం కష్టమనేలా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ బాబు లాంటివాళ్లు అయితే ఏమో అనుకోవచ్చు. కానీ టయర్ 2, 3 హీరోలు సైతం ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ మీద మొగ్గు చూపుతూ బోలెడు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అసలు 70 వయసు వచ్చేనాటికే వీళ్లంతా రిటైర్ అయిపోయేలా ఉన్నారు.