ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం, సరైన రీతిలో ప్లాన్ చేసుకోవడంలోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాంబోలు, బ్యానర్ల ఉచ్చులో పడి ఏది బడితే అది ఒప్పుకుంటే వరస ఫ్లాపులు కెరీర్ ని దెబ్బ తీస్తాయి. ఫలానా టయర్ 1 హీరోతో నటించామనే సంతృప్తి మిగలడం తప్ప కెరీర్ లో గొప్పగా చెప్పుకోవడానికి ఏముండదు. ఇది అర్థం కావాలంటే ఇద్దరిని ఉదాహరణగా తీసుకోవాలి.
పెళ్లి సందడితో పరిచయమైన శ్రీలీలకు ఇప్పుడు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. కారణం ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినడమే. ఇప్పటిదాకా రవితేజ ధమాకా, బాలకృష్ణ భగవంత్ కేసరి తప్ప తనకు ఇంకో సూపర్ హిట్ లేదు. గుంటూరు కారం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి, మాస్ జాతర, జూనియర్, రాబిన్ హుడ్, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, ఆదికేశవ, స్కంద ఇలా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు క్యూ కట్టి పలకరించాయి. వీటికి మినిమమ్ రికవరీ జరగలేదు.
ఇంకోవైపు మమిత బైజు ఎన్ని అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడుగులు వేస్తోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ లో అంత పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రను అలవోకగా పోషించిన తీరు కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసింది. రెండున్నర గంటల పాటు సీరియస్ గా ఉండే సూర్య పక్కన నవ్వులు పూయించింది మమితనే. జన నాయకుడు దారుణంగా పోయింది కానీ అందులో మమిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇది భగవంత్ కేసరిలో శ్రీలీల చేసిన క్యారెక్టరే కావడం అసలు ట్విస్ట్.
ఇండస్ట్రీకి వచ్చి ఆరేడు సంవత్సరాలు అవుతున్నా మమిత చేసిన సినిమాలు పదిహేను లోపే. వాటిలో సూపర్ శరణ్య, ప్రేమలు లాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ ఉన్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా అదే కోవలోకి చేరుతుంది. ప్రస్తుతం రెండు తమిళ, ఒక మలయాళం సినిమాలు చేస్తోంది. శ్రీలీల అనురాగ్ బసు డైరెక్షన్ లో బాలీవుడ్ డెబ్యూ కోసం రెండేళ్లుగా కష్టపడుతోంది కానీ ఇంకా పూర్తవ్వడం లేదు. ధనుష్ ఓంలో సాయిపల్లవితో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates