మేకింగ్ వీడియోలతో కామెడీ చేస్తున్నారా

ఇటీవలే విడుదలైన విశాల్ మకుటం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది కలెక్షన్లు చూస్తే. మొదటి వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా కనీసం రెండు కోట్ల గ్రాస్ రాకపోవడం ట్రేడ్ ని పెద్ద షాక్ కి గురి చేసింది. ఎందుకంటే ఇందులో నటించింది ఏదో అప్ కమింగ్ హీరో కాదు. తెలుగు తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ గుర్తింపు ఉన్న మాస్ స్టార్. ఇంతా చేసి మకుటంకు కనీస బజ్ తెచ్చుకోవడంలో టీమ్ దారుణంగా ఫెయిలయ్యింది. అందుకే ఓపెనింగ్స్ రాలేదు.

ఇదిలా ఉండగా టాక్ ఇలా ఉందని తెలిసి కూడా విశాల్ ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఋజువు చేసుకునేందుకు పదే పదే మేకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పడం ట్రోలింగ్ కు దారి తీస్తోంది. క్లైమాక్స్ ఫైట్ లో అవసరానికి మించి కెమెరా మెన్ కు సూచనలు ఇవ్వడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి బుగ్గలకు తనే స్వయంగా మేకప్ చేయడం లాంటివి కామెడీగా అనిపిస్తున్నాయి. ఏదో బాహుబలి తీసినంత రేంజ్ లో ఈ హడావిడి ఏమిటని ఫ్యాన్సే అంటున్నారు.

విశాల్ ఒకటి గుర్తించాలి. తన మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. హిట్టు పడాలంటే రొటీన్ ఎంటర్ టైనర్లతో పనవ్వదు. ఇది తెలుసుకోకుండా ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వచ్చిన కథలను ఎత్తుకొచ్చి ఇప్పుడు డబుల్ యాక్షన్ పేరుతో రుద్దుతామంటే ఆడియన్స్ అంత అమాయకంగా లేరు. పైగా ఇంతోటి దానికి ఏదో ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు మూడు గంటలకు పైగా నిడివి పెట్టడం ఊహించనంత పెద్ద నెగటివిటి తీసుకొచ్చింది. బయట చాలా డ్యామేజ్ చేసింది.

దర్శకత్వం చేయడం తప్పు కాదు. ఎన్టీఆర్, కృష్ణ దగ్గర నుంచి విశ్వక్ సేన్, రామ్ పోతినేని దాకా అందరూ ట్రై చేశారు, చేస్తున్నారు. కానీ సబ్జెక్టు ఎంచుకునే క్రమంలో తాము ఏ కాలంలో ఉన్నామో చెక్ చేసుకోవడం విశాల్ లాంటి వాళ్లకు చాలా అవసరం. ఇప్పుడీ మకుటం దెబ్బకు నెక్స్ట్ విశాల్ సినిమా అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. డిటెక్టివ్ 2 తీయాలని మొదలుపెట్టి దాని స్థానంలో మకుటం చేయడం విశాల్ కి తీరని నష్టం చేసింది.