క్రిస్టోఫర్ నోలన్‌తో ఎప్పటికైనా పని చేయాలని ఉందని కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అనగానే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పాతికేళ్లు కూడా నిండని వయసులో అప్పుడే నోలన్ వరకు ఆలోచిస్తున్నాడా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ సాయి ట్రాక్ రికార్డ్ చూసిన వాళ్లు మాత్రం ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందని కౌంటర్ ఇస్తున్నారు. రేపే ఆయన హాలీవుడ్ వెళ్తున్నానని చెప్పలేదు. కానీ తన భవిష్యత్తు లక్ష్యాన్ని మాత్రమే అందరితో పంచుకున్నాడు.
అసలు సాయి పేరు సినిమాల కంటే ముందు ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారానే బాగా ఫేమస్ అయింది. కచ్చి సేరా, ఆసా కూడ లాంటి పాటలతో తక్కువ టైమ్‌లోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సాంగ్స్ ఒక భాషకు పరిమితం కాకుండా తెలుగు, హిందీ ఆడియన్స్‌ను కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఆ క్రేజ్ తోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడికి వెంటనే స్టార్ హీరోల ప్రాజెక్టులు క్యూ కట్టాయి.
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు సినిమా హిట్ అవ్వడంతో సాయి మీద ఇండస్ట్రీ జనాలకు నమ్మకం గట్టిగానే పెరిగింది. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు మ్యూజిక్ ఇస్తున్నాడు. దాంతో పాటు ధనుష్, కార్తి సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి. టాలెంట్ ఉంటే వయసుతో పనిలేదని చెప్పడానికి సాయికి వచ్చిన ఈ వరుస అవకాశాలే బెస్ట్ ఎగ్జాంపుల్.
అయితే నోలన్ సినిమాకు మ్యూజిక్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆయన సినిమాల్లో పాటలకు ఉండే ప్రాధాన్యత కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. హాన్స్ జిమ్మర్, లుడ్విగ్ గోరాన్సన్ లాంటి లెజెండ్స్ తో పని చేసిన నోలన్ స్థాయిని అందుకోవాలంటే ఎంతో ఎక్స్ పీరియన్స్ కావాలి. అలాంటి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్న సాయిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అతని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. సంగీతానికి భాష అడ్డంకి లేదనే విషయం ఎప్పటినుంచో తెలుసు. ఏఆర్ రెహమాన్ హాలీవుడ్ కు వెళ్లి ఆస్కార్ అవార్డులు సాధించి ఇండియన్ సినిమా సత్తా చాటాడు.
ఇప్పుడు మన టెక్నీషియన్స్ కు ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫర్స్ రావడం కూడా పెద్ద వింతేమీ కాదు. ఇక్కడి సినిమాల్లో సాయి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తే, భవిష్యత్తులో విదేశీ దర్శకుల దృష్టిలో పడటం అసాధ్యమైన పనేమీ కాదు. అయితే రాకా లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఎలాంటి అవుట్ పుట్ ఇస్తాడనేది అతని కెరీర్ కు ఒక అగ్నిపరీక్ష లాంటిది. అందులో సక్సెస్ అయ్యి ఆ తర్వాత రాబోయే ప్రాజెక్టుల్లో కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే తన డ్రీమ్ కు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. పెద్ద కలలు కనడంలో ఎలాంటి తప్పు లేదు. దానికి తగ్గ కష్టం కూడా తోడైతే ఏదైనా సాధ్యమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates