బండ్ల గణేష్ నెట్‌వర్క్… సోషల్ మీడియా చర్చ

నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విచ్చేశారు. టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా చిరంజీవి నుంచి రాజా రవీంద్ర దాకా లెక్కలేనంత మంది కనిపించారు. ఇక రాజకీయ నాయకులు సరేసరి. రూలింగ్ కాంగ్రెస్, అపోజిషన్ బిఆర్ఎస్, ఎపి అధికార పార్టీ టిడిపి, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు లెక్కబెట్టుకుంటూ పోతే ఆయాసం వచ్చేంత లిస్ట్ అవుతుంది.

నిజానికి బండ్ల గణేష్ పేరుమోసిన పొలిటీషియన్ కాదు. కాంగ్రెస్ పార్టీలో చాన్నాళ్లు ఉన్నప్పటికీ పెద్ద స్థాయికి చేరుకోలేదు. నిర్మాతగా గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో పాటు బాద్షా, టెంపర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి. అయితే కొన్ని ఫ్లాపుల తర్వాత నిర్మాణం నుంచి దూరంగా జరిగారు. తరచు మీడియాలో ఏవో ఒక వివాదాల్లో ఉండే బండ్ల గణేష్ దీపావళికి పటాసులు కాల్చినా, ఇంట్లో ఏదైనా వేడుక చేసినా సోషల్ మీడియాలో హైలైటయ్యే రేంజ్ లో కనిపిస్తారు.

ఒక కమెడియన్, చిన్న నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్ చాలా కాలం సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానే కొనసాగారు. నిర్మాతగా మారే వరకు ఆయన రేంజ్ మధ్యస్థంగానే ఉండేది. అయితే పిఆర్ వ్యవస్థలో బలంగా ఉండటం, అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించడం, ఏదైనా బయటికి చెప్పేసే భోళాతనం బండ్ల గణేష్ కు శత్రువుల కంటే ఎక్కువగా మిత్రులను సంపాదించి పెట్టింది. అందుకే ముహూర్తం టైంకి ఏపీ సిఎం హాజరయ్యేలా చూసుకున్నారు.

ఇకపై బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా కొనసాగినా కొనసాగకపోయినా ఈ హై ప్రొఫైల్ జీవితాన్ని మాత్రం కొనసాగిస్తారని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఆస్తులు ఎంతోమందికి ఉంటాయి. ఈయన కన్నా తలలు పండిన ప్రొడ్యూసర్లు ప్రతి పరిశ్రమలో ఉన్నారు. వాళ్ళందరి వేడుకలకు సిఎంలు, టాప్ స్టార్లు వెళ్ళరు. అది బండ్ల గణేష్ కే సాధ్యమయ్యిందంటే నటుడిగా, రాజకీయ నాయకుడిగా సంపాదించిన దానికన్నా ఒక వ్యక్తిగా సంపాదించిన నెట్ వర్కే బలమైందిగా ఋజువయ్యిందిగా.