లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన ‘డీసీ’ సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన ఈ డబ్బింగ్ సినిమా పది రోజులు దాటుతున్నా ఇక్కడ సాలిడ్ గా రన్ అవుతోంది. డైరెక్టర్ గా ఇన్నాళ్లు తన సత్తా చూపించిన లోకేష్, కెమెరా ముందు ఎలా చేశాడనే క్యూరియాసిటీతో జనం థియేటర్లకు వెళ్లారు. ఇప్పుడు అదే సినిమాను మన టాలీవుడ్ టాప్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ చూసి ఏకంగా రివ్యూలు ఇచ్చేయడంతో డీసీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లోకేష్ దేవదాస్ అనే క్యారెక్టర్ లో నటించగా, వామికా గబ్బి చంద్రగా కనిపించింది. హీరోగా లోకేష్ కు ఇదే ఫస్ట్ అటెంప్ట్. రిలీజైన రెండో రోజే తెలుగు వెర్షన్ కు ఏకంగా 42 శాతం ఆక్యుపెన్సీ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎనిమిదో రోజు కూడా మన దగ్గర దాదాపు 80 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. టాక్ అటు ఇటుగా ఉన్నా కూడా లోకేష్ బ్రాండ్ ఇమేజ్, అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిలబెట్టాయి.
దీనికి తోడు ఇప్పుడు మన స్టార్ హీరోల సపోర్ట్ కూడా దక్కింది. సినిమా చూసిన మహేష్ బాబు.. ఇదొక ఔట్ స్టాండింగ్ ఒరిజినల్ మూవీ అంటూ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పాడు. ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డీసీని ఒక తమిళ్ క్లాసిక్ అని హైలెట్ చేశాడు. ప్రతి సినిమా అభిమాని చూడాల్సిన చిత్రమని చెబుతూ.. అరుణ్, అనిరుధ్, వామికాతో పాటు లోకేష్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.
అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ తోనే ఉండటంతో ఈ పోస్ట్ కు మరింత క్రేజ్ వచ్చింది. మన ఆడియన్స్ కు తమిళ సినిమాలు ఎప్పటినుంచో అలవాటే. అలాగని ఏది పడితే అది చూసేయరు. ట్రైలర్ బాగుండాలి లేదా తెలిసిన ఫేస్ అయినా ఉండాలి. డీసీ విషయానికి వస్తే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఇక్కడ లోకేష్ క్రియేట్ చేసుకున్న క్రేజ్ గట్టిగా వర్కౌట్ అయింది. మనకు బాగా తెలిసిన ఒక డైరెక్టర్ హీరోగా ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి యూత్ ను థియేటర్ల వైపు నడిపించింది.
ఒకపక్క తెలుగు హీరోలు సపోర్ట్ చేస్తుంటే తమిళ హీరోలు మాత్రం పట్టేపట్టనట్టు ఉండడం తమిళులకు ఏ మాత్రం నచ్చలేదు. ఇది ఇప్పటిది కాదు, గతంలో కూడా అనేక సార్లు జరిగిన విషయం మనందికి గుర్తుండే ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates