అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది విడుద‌లైన ఓ త‌మిళ చిత్రంలో ఆమె క‌లిసిన న‌టించిన యువ క‌థానాయ‌కుడితో దాదాపు రెండేళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉంది అనుప‌మ‌. ఐతే త‌న‌తో బంధంలో ఉన్నంత వ‌ర‌కు ఏమీ మాట్లాడ‌ని అనుప‌మ‌.. బ్రేక‌ప్ త‌ర్వాత ఆ రిలేష‌న్‌షిప్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది.

ముందు సోష‌ల్ మీడియాలో క్రిప్టిక్ పోస్టులు పెట్టిన ఆమె.. త‌ర్వాత మీడియా ముందూ దాని గురించి ఓపెన్ అవుతోంది. ఇటీవ‌లే ఒక ఇంట‌ర్వ్యూలో త‌న ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను అప‌రిచితుడిగా అభివ‌ర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఇంట‌ర్వ్యూకు సంబంధించి పార్ట్-2 బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో త‌న పాస్ట్ రిలేష‌న్‌షిప్ గురించి మ‌రింత లోతుగా మాట్లాడింది అనుప‌మ‌.

గ‌త ఏడాది అనుప‌మ లీడ్ రోల్ చేసిన ప‌ర‌దా అనే చిన్న సినిమా రిలీజ్ ముంగిట ప్రెస్ మీట్లో అనుప‌మ ఎంతో ఎమోష‌న‌ల్ అవుతూ ఏడ్చేయ‌డం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాతో త‌న‌కు ఏర్ప‌డిన భావోద్వేగ బంధం వ‌ల్లే ఆమె అప్పుడ‌లా క‌న్నీళ్లు పెట్టుకుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అస‌లు విష‌యం వేర‌ని, ఆ బాధ‌కు కార‌ణం త‌న ఎక్స్ బాయ్‌ఫ్రెండే అని ఆమె వెల్ల‌డించింది.

ఆ రోజు అంద‌రూ అది సినిమా కోసం చేసిన‌ ప‌బ్లిసిటీ స్టంట్ అని కూడా అనుకున్నార‌ని.. ఆ రోజు స్టేజ్ మీదికి రావ‌డానికి ముందు అప్ప‌టి త‌న బాయ్‌ఫ్రెండ్ త‌న‌ను మాట‌ల‌తో పెట్టిన హింస వ‌ల్లే అలా ఏడ్చానని అనుప‌మ చెప్పింది. త‌న‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ రెండేళ్లు తాను బాగున్నా అనుకుంటూ న‌టిస్తూ బ‌తికిన‌ట్లు అనుప‌మ పేర్కొంది. త‌న‌ను కాపాడాల్సిన వాడే త‌న‌ను నాశ‌నం చేయ‌డానికి చూశాడ‌ని.. అత‌డి వ‌ల్ల తీవ్ర మ‌నో వేద‌న‌ను అనుభ‌వించాన‌ని.. అది త‌న ఆరోగ్యం మీద కూడా ప్ర‌భావం చూపింద‌ని అనుప‌మ చెప్పుకొచ్చింది.

ఆ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల తాను బ‌రువు త‌గ్గాన‌ని.. ఏడ్చి ఏడ్చి త‌న క‌ళ్లు వాచిపోయాన‌ని.. కుడి క‌నుబొమ్మకు స‌ర్జ‌రీ చేయించుకోవాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింద‌ని ఆమె వాపోయింది. ఆ వ్య‌క్తితో రిలేష‌న్షిప్‌లో ఉన్నంత కాలం ఒక మ‌హిళ‌గా, న‌టిగా తాను సిగ్గుప‌డే స్థితిలో ఉన్నానంటూ ఆమె తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది.