సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన ఆమె త్వ‌ర‌లోనే సిగ్మా మూవీతో త‌మిళంలోనూ అడుగు పెడుతోంది. ఇలా కెరీర్ ప‌రంగా మంచి ఊపులో సాగుతున్న టైంలో ఫ‌రియా అబ్దుల్లా సోష‌ల్ మీడియాలో త‌నకు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న మ‌త‌ప‌ర‌మైన‌ హేట్ క్యాంపైన్ చూసి క‌న్నీళ్లు పెట్టుకుంది. ఇండిపెండెన్స్ డే రోజు ఏడుస్తూ ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఫ‌రియా క‌న్నీళ్ల‌కు కార‌ణం.. ఇటీవ‌ల ఆమె హైద‌రాబాద్‌లో బోనాల పండుగ‌లో పాల్గొన‌డ‌మ‌ని తెలుస్తోంది. ఆ పండుగ‌లో ఫరియా హిందూ వేష‌ధార‌ణ‌లో క‌నిపించింది. ముస్లిం అయిన త‌నపై హిందూ పండుగ‌లో చూపించిన ఆద‌ర‌ణ‌కు ఆమె ఎంతో భావోద్వేగానికి గురై క‌న్నీళ్లు కూడా పెట్టుకుంది. ఐతే ఈ ప‌రిణామం ఆమె మ‌త‌స్థులైన కొందరికి న‌చ్చ‌లేదు. ఆ రోజు నుంచి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో తీవ్ర‌మైన వ్య‌క్తిగ‌త దాడిని ఎదుర్కొంటోంద‌ట ఫ‌రియా.

హిందూ పండుగ‌లో పాల్గొన్నందుకు త‌న‌ను ఇస్లాం ద్రోహిగా అభివ‌ర్ణిస్తూ పెద్ద ఎత్తున హేట్ మెసేజ్‌లు వ‌స్తుండ‌డంతో ఫ‌రియా ఇండిపెండెన్స్ డే రోజు క‌న్నీళ్లు పెట్టుకుంటూ వీడియో పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న కుటుంబ నేప‌థ్యాన్ని మ‌రోసారి గుర్తు చేసింది. ఫ‌రియా త‌ల్లి ముస్లిం కాగా, ఆమెకు హిందూ మ‌తం న‌చ్చి అందులోకి వ‌చ్చేశారు. తండ్రి హిందువు కాగా.. ఆయ‌న ఇస్లాం మ‌తం ప‌ట్ల ఆక‌ర్షితుడై అందులోకి వెళ్లారు.

త‌న తండ్రి క‌న్వ‌ర్టెడ్ ముస్లిం అని, అంటే అర్థం తెలుసుకోవాల‌ని, ఈ మ‌తం న‌చ్చి ఆయ‌న అందులోకి వ‌చ్చార‌ని.. త‌న‌కు ఈ మ‌తంలోని మంచి విష‌యాల‌ను మాత్ర‌మే ఆయ‌న బోధించిన‌ట్లు చెప్పుకొచ్చింది ఫ‌రియా.
త‌న‌కు ప్రేమించ‌డం మాత్ర‌మే తెలుస‌ని.. త‌న‌ను ఇస్లాం ద్రోహిగా అభివ‌ర్ణిస్తూ దాడి చేస్తున్న వారిని కూడా ప్రేమిస్తాన‌ని.. వాళ్ల బాగు కోరుకుంటాన‌ని ఆమె వ్యాఖ్యానించింది.

తాను ప్రేమ కోసం, శాంతి కోసం, ఐక‌మ‌త్యం కోసం ప్రార్థిస్తాన‌ని.. అందుకోసం పోరాడ‌తాన‌ని ఆమె అంది. చుట్టూ ఉన్న మ‌నుషుల్లో దేవుడిని చూడ‌లేక‌పోవ‌డం అంటే ఏదో మిస్స‌వుతున్న‌ట్లే అని చెబుతూ త‌న హేట‌ర్స్ ప‌ట్ల ఒకింత సానుభూతి వ్య‌క్తం చేసింది. ఈ వీడియో అంత‌టా ఫ‌రియా తీవ్రమైన బాధ‌తో, క‌న్నీళ్ల‌తోనే కనిపించింది. ఫ‌రియా ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేస్తూ నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ఆమెకు అండ‌గా నిలుస్తున్నారు.