ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా రొమాంటిక్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ తర్వాత వరస ఫ్లాపులతో మార్కెట్ ని రిస్క్ లో పడేసుకున్నాడు. ఒక దశలో ఏం చేయాలో అర్థం కాక బ్రేక్ తీసుకున్నాడు. చివరికి విలన్ గా కొనసాగుదామని సల్మాన్ ఖాన్ టైగర్ 3, పవన్ కళ్యాణ్ ఓజి లాంటి వాటిలో ప్రతినాయకుడిగా మెప్పించాడు. ఇలాంటి టైం ఊహించని ట్విస్ట్ జరిగింది.

తాజాగా విడుదలైన ఆవారాపన్ 2 వసూళ్లు ఉత్తరాది బయ్యర్ల మతులను కాదు దక్షిణాది డిస్ట్రిబ్యూటర్ల బయ్యర్లను బుర్రలను పాడు చేస్తున్నాయి. ఎందుకంటే కలెక్షన్లు ఆ స్థాయిలో రెచ్చిపోతున్నాయి. మొదటిరోజు అత్యధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు కాగా శని ఆదివారాలు అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడో ఏపీలో కర్నూలు జిల్లా కేంద్రంలో మొదటి రోజు రెండు షోలు ఇస్తే రెండో రోజుకి అయిదుకి పెంచాల్సి వచ్చింది. అది కూడా ఇంత టైట్ సిచువేషన్ లో.

నిజానికిది ఇమ్రాన్ హష్మీ కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే ఆవారాపన్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ కాదు. తొలి రిలీజ్ లో నష్టాలు తెచ్చింది. తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది. పాటలు బాగా రీచ్ అయ్యాయి. ఓటిటి, హోమ్ వీడియోలో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. అందుకే పార్ట్ 2 మీద ఇంత బజ్ వచ్చింది. అలాని దీనికేం యునానిమస్ టాక్ రాలేదు. పర్లేదు నుంచి బాలేదనే కామెంట్స్ దాకా అన్నీ వినిపించాయి. అయినా వసూళ్లు ఆగడం లేదు.

ఈ లెక్కన ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. గత ఏడాది విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ లో దర్శకుడు ఆర్యన్ ఖాన్ ఒక డైలాగు పెట్టాడు. తనదైన రోజు వస్తే ఇమ్రాన్ హష్మీ ముందు ఎవరు నిలవలేరనేది దాని సారాంశం. ఆ సీన్ లో ఇమ్రాన్ హష్మీ నవ్వుస్తూ కనిపిస్తాడు. కట్ చేస్తే ఇవాళ అమీర్ ఖాన్ నిర్మాణంలో సన్నీ డియోల్ హీరోగా రూపొందిన బట్వారా 1947ని కాలి కింద తొక్కేసే రేంజ్ లో ఆవారాపన్ 2 డామినేట్ చేయడం ఎవరూ ఊహించనిది.