కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మొదటి భాగం థియేటర్ రిలీజ్ జరిగినప్పుడు గొప్ప ఫలితం అందుకోలేదు. క్రమంగా కల్ట్ స్టేటస్ వచ్చింది. అలాంటిది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన కొనసాగింపుకి హైప్ రావడం విచిత్రమే. నార్త్ లో అంటే ఏదో అనుకోవచ్చు, హైదరాబాద్ ప్రీమియర్ స్క్రీన్స్ చాలా వాటిలో ఈ మూవీకి టికెట్ దొరకడం కష్టమైపోయింది.
అంతగా ఏముందో చూద్దాం. కెజిఎఫ్, పుష్పలాగా ఇది కూడా స్టోరీ పరంగా కంటిన్యూ చేసిన మూవీనే. ఫస్ట్ పార్ట్ లో ప్రియురాలు అలియా చనిపోయిన జ్ఞాపకాలతో ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాడు శివమ్ పండిట్(ఇమ్రాన్ హష్మీ). అనుకోకుండా ఓ అనాథ పాపను చేరదీస్తాడు. ఒక కుటుంబం దత్తత తీసుకుని వెళ్ళాక పాప ప్రమాదంలో ఉందని గుర్తించి బ్యాంకాక్ చేరుకుంటాడు. అక్కడ డాన్ జొరావర్ చెల్లెలు జారా(దిశా పటాని)ని ఇష్టపడతాడు. చిన్నారి కోసం వచ్చిన శివమ్ కు అక్కడి మాఫియా ప్రమాదాలతో స్వాగతం చెబుతుంది. తర్వాత జరిగేది ఊహించుకోవచ్చు.
ఇమ్రాన్ హష్మీ వన్ మ్యాన్ షోలా సాగిన ఆవారాపన్ 2 బయట బిల్డప్ ఏర్పడినంత గొప్పగా లేదనేది వాస్తవం. అయితే బాలీవుడ్ ఆడియన్స్ పల్స్ ఈ మధ్య అంతు చిక్కడం లేదు. అంతంత మాత్రం రివ్యూలు, పబ్లిక్ టాక్ వచ్చిన సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. సీరియస్ లేదా కామెడీ జానర్ ఏదైనా ఈ ట్రెండ్ వల్ల కొన్ని చిత్రాలు లాభపడ్డాయి. చూస్తుంటే ఆవారాపన్ 2 కూడా అదే కోవలోకి చేరినా ఆశ్చర్యం లేదు. ముంబై క్రిటిక్స్ యావరేజ్ కిరీటమే ఇచ్చారు.
ఇలాంటి రెస్పాన్స్ కు కారణం లేకపోలేదు. దురంధర్ తర్వాత ఆ స్థాయిలో ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమా హిందీలో రాలేదు. దీంతో ఆవారాపన్ 2 మీద అనుకోకుండా బజ్ పెరిగింది. మొదటి భాగం మీద ఉన్న కల్ట్ క్లాసిక్ ముద్ర జెన్ జీ జనాలను సీక్వెల్ వైపు ఆసక్తి పెంచుకునేలా చేసింది. నితిన్ కక్కర్ దర్శకుడిగా పూర్తి అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్ గా సేఫ్ చేసేలా ఉన్నాడు. దీని వల్ల ఇమ్రాన్ హష్మీ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటే సోలో హీరోగా మరిన్ని సినిమాలు చూడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates