హను… నాగ్ లాగా హిట్టిస్తాడా?

ప్రభాస్ దర్శకుల ఎంపిక ఎప్పుడూ ఒకే లెక్కలో ఉండదు. తన మార్కెట్‌కు సరిపోయే టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. సుజీత్‌తో సాహో, రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్, ఓం రౌత్‌తో ఆదిపురుష్, మారుతితో ద రాజా సాబ్ చేశారు. ప్రభాస్ స్థాయిలో భారీ సినిమాలు ముందే హ్యాండిల్ చేసిన వాళ్లు కాకపోయినా, వాళ్లపై నమ్మకం పెట్టి పెద్ద ఛాన్స్ ఇచ్చాడు.

అయితే ఈ కాంబినేషన్స్‌లో ఫలితాలు మాత్రం ప్రభాస్‌కు పెద్దగా కలిసి రాలేదు. సాహో అంచనాలకు తగ్గ రేంజ్‌లో నిలవలేకపోయింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ గట్టిగానే నిరాశపరిచాయి. ఈ ఏడాది వచ్చిన ద రాజా సాబ్ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. మరోవైపు నాగ్ అశ్విన్ మాత్రం కల్కి 2898 ఏడీతో ప్రభాస్ ఇచ్చిన భారీ స్కేల్‌ను సరిగ్గా వాడుకున్నాడు.

ఇప్పుడు హను రాఘవపూడి చేతిలో ఫౌజీ ఉంది. హనుకు టాలెంట్ మీద ఎలాంటి డౌట్ లేదు. తన స్టైల్‌లో మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ప్రభాస్ లాంటి స్టార్‌తో ఇంత పెద్ద కాన్వాస్‌పై సినిమా చేయడం మాత్రం అతనికి ఇదే మొదటిసారి. అందుకే ఫౌజీ రిజల్ట్ హను కెరీర్‌కు కూడా చాలా కీలకం.

ఈ టైమ్‌లో నిర్మాత మైత్రీ రవి చెప్పిన ఒక విషయం ఆసక్తి పెంచుతోంది. ప్రభాస్‌కు షూటింగ్ లేకపోయినా ఒక రోజు ఫౌజీ సెట్‌కు వచ్చారట. మానిటర్ దగ్గర కూర్చుని షూటింగ్ ఎలా జరుగుతోంది, సీన్స్ ఎలా వస్తున్నాయి అన్నది గమనించారని ఆయన చెప్పారు. తన పని లేని రోజు కూడా సెట్లో ఉండటం అంటే ప్రభాస్ ఈ సినిమాను చాలా దగ్గరగా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.

గతంలో కొన్ని భారీ సినిమాలు రిజల్ట్ విషయంలో గట్టిగానే దెబ్బకొట్టాయి. అందుకే ఇప్పుడు తన ప్రాజెక్ట్స్ విషయంలో ప్రభాస్ కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారా అనే ఫీలింగ్ రావడం సహజం. ఫౌజీ సెట్లో ఆయన ఇలా కనిపించడం కూడా అదే డౌట్‌కు కారణమవుతోంది. అంతే తప్ప హను మీద నమ్మకం లేదని అనుకోవడానికి మాత్రం ఎలాంటి కారణం లేదు.

హనుకు మాత్రం ఇది మామూలు ఛాన్స్ కాదు. నాగ్ అశ్విన్ కల్కితో ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకొని తన రేంజ్ మార్చుకున్నాడు. ఇప్పుడు ఫౌజీతో హను కూడా అదే స్థాయిలో తన సత్తా చూపిస్తే, అతని కెరీర్ లెక్కలు పూర్తిగా మారిపోవచ్చు.