ఈ గురువారం టాలీవుడ్లోకి ఒక కొత్త హీరో అడుగు పెట్టాడు. తెలుగు సినిమా చరిత్రలోనే తమకంటూ ఒక అధ్యాయం లిఖించుకున్న ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన ఆ హీరోనే.. జైకృష్ణ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమాతో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఐతే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకునేలా కనిపించడం లేదు.
బ్యాడ్ టాక్‌తో మొదలైన సినిమాకు సరైన ఓపెనింగ్స్ లేవు. అంతిమంగా ఈ చిత్రం డిజాస్టర్ కాబోతోందన్నది ఫిక్స్. ఐతే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జైకృష్ణ అయితే తన ప్రతిభను చాటుకున్నాడు. తొలి సినిమాలో తన పెర్ఫామెన్స్‌పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. జైకృష్ణ ఫస్ట్ మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా రెండో సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
కృష్ణ కుటుంబానికి వీరాభిమాని అయిన సీనియర్ నిర్మాత అనిల్ సుంకర.. జైకృష్ణ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. మహేష్‌తో ఆయన దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో వరుస ఫ్లాపులతో కొంచెం దెబ్బ తిన్నప్పటికీ.. సామజవరగమన, నారీ నారీ నడుమ మురారి లాంటి చిత్రాలతో అనిల్ పుంజుకున్నారు. జైకృష్ణతో చేయబోయే సినిమాకు ఇంకా దర్శకుడు, కథ ఖరారు కాకపోయినా.. తనతో అనిల్ సినిమా తీయడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.
శ్రీనివాస మంగాపురం సినిమాలో జైకృష్ణను బాగా రిసీవ్ చేసుకున్న కృష్ణ, మహేష్ అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ నిర్వహించగా, దానికి అతిథిగా వచ్చిన అనిల్ సుంకర.. జైకృష్ణ గురించి గొప్పగా మాట్లాడాడు. తొలి సినిమాలో జైకృష్ణ అదరగొట్టాడని, అతడి రూపంలో ఇండస్ట్రీకి ఇంకో మంచి హీరో దొరికాడని కొనియాడాడు. దీన్ని బట్టే అనిల్.. జైకృష్ణతో సినిమా చేయబోతున్నాడని స్పష్టమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

