ఆదిపురుష్ పోలిక ఇప్పుడు అనవసరం

ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో ఉన్న పోలికలు బయటికి తీస్తూ ఓం రౌత్, నితేశ్ తివారి ఇద్దరిలో ఎవరు బాగా చూపించారనే పాయింట్ మీద రకరకాల డిస్కషన్లు చేసుకుంటున్నారు. నాలుగు నిమిషాల సుదీర్ఘమైన వీడియోలో సినిమా ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇవ్వడంతో పాటు విఎఫ్ఎక్స్ నాణ్యత మీద స్పష్టత ఇవ్వడం ట్రైలర్ లోని ప్రధాన విశేషం.

సరే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ప్రమోషన్లు మొదలైనప్పుడు కంటెంట్ కి సంబంధించి నెగటివ్ ప్లస్ పాజిటివ్ అన్ని రకాల రియాక్షన్లు వస్తాయి. ఇది సహజం. కేవలం చిన్న వీడియోని పట్టుకుని ఆదిపురుష్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే పోలికలు ఇప్పుడైతే అవసరం లేదు. ఒకవేళ అలా చేయాలి అనుకుంటే దూరదర్శన్ రామాయణం, శోభన్ బాబు సంపూర్ణ రామాయణం, లవకుశ, ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం లాంటివి రెఫరెన్సుగా తీసుకుని డిస్కస్ చేయాలి.

సరే అవి మరీ పాత సినిమాలు అనుకుంటే ఆదిపురుష్ తప్ప గత కొన్నేళ్లలో ఇంత బడ్జెట్ తో ఈ ఇతిహాస గాథ మీద వచ్చిన సినిమా మరొకటి లేదు. ఓం రౌత్ తప్పు చేసింది కేవలం రైటింగ్ విషయంలోనే కాదు. క్యాస్టింగ్ లోనూ లెక్కలేనన్ని తప్పులు చేశారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ని ఎంచుకోవడం ఒక పొరపాటు అయితే అతనికి వేసిన గెటప్ విపరీతమైన నెగటివిటీని తీసుకొచ్చింది. కానీ రామాయణలో అలాంటి తీవ్రమైన బ్లండర్స్ ప్రస్తుతానికి కనిపించడం లేదు.

ఏది ఏమైనా రామాయణ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇకపై ఎవరూ ఇంత గొప్పగా తీయలేరనే స్థాయిలో చూపిస్తానని దర్శకుడు నితేశ్ తివారి గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ట్రైలర్ స్పందన ఎలా ఉన్నా అసలు సినిమాతో స్పెల్ బౌండ్ చేయాలి. ఇదింకా మొదటి భాగమే కాబట్టి పార్ట్ 2కి బిజినెస్ అమాంతం రెట్టింపు కావాలంటే బాహుబలి రేంజ్ లో ప్రపంచమంతా సౌండ్ వినిపించాలి. అంతే తప్ప ఆదిపురుష్ పోలికలతో డైవర్ట్ అయ్యే అవకాశం ఇకపై ఇవ్వకూడదు.