సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు, అంద‌గాడైన‌ సుమంత్‌.. న‌టుడిగానూ మంచి పేరే సంపాదించాడు. కాక‌పోతే ఎప్పుడో ఒక‌సారి ఒక మంచి, స‌క్సెస్‌పుల్‌ సినిమా చేయ‌డం.. ఆ త‌ర్వాత ట్రాక్ త‌ప్ప‌డం.. మ‌ళ్లీ హిట్టు కోసం పోరాడ‌డం.. 20 ఏళ్లుగా ఇలాగే సాగుతోంది త‌న కెరీర్‌. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్ళీ రావాతో హిట్టు కొట్టినా.. దాన్ని నిల‌బెట్టుకునే సినిమాలు చేయ‌లేక‌పోయాడు.

ఐతే ఇప్పుడు సుమంత్ నుంచి రాబోతున్న సినిమాలు కొంచెం ప్రామిసింగ్‌గా క‌నిపిస్తున్నాయి. అందులో ఒక‌టైన న్యూట‌న్స్ థ‌ర్డ్ లా ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదొక మంచి థ్రిల్ల‌ర్‌లా క‌నిపిస్తోంది. దీని త‌ర్వాత సుమంత్ నుంచి రాబోతున్న మూవీ.. మ‌హేంద్రిగిరి వారాహి.

ప్ర‌స్తుత ట్రెండుకు త‌గ్గ‌ట్లు డివైన్ ఎలిమెంట్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ చిత్ర‌మిది. ఇంత‌కుముందు సుమంత్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే థ్రిల్ల‌ర్ మూవీ తీసిన సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఈ చిత్రాన్ని రూపొందించాడు. కృష్ణ‌వంశీతో రంగమార్తాండ చేసిన‌ మ‌ధు ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ సినిమా ప్రోమోలు ఇంట్రెస్టింగ్‌గా ఉండి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఐతే మార్కెట్ బాగా దెబ్బ తిన్న సుమంత్ మీద ఈ చిత్ర నిర్మాత రూ.26 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ముందు ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తీయాల‌నుకున్న సినిమాకు వీఎఫెక్స్ కార‌ణంగా ఖ‌ర్చు బాగా పెరిగింద‌ట‌. ఈ సినిమా విజువ‌ల్స్ అవీ చూస్తే ఆ బ‌డ్జెట్ మ‌రీ ఎక్కువేమీ అనిపించ‌డం లేదు. ఏకంగా గంట పాటు సినిమాలో వీఎఫెక్స్ ఉంటాయ‌ట‌. సినిమాలో గ్రాండియ‌ర్ క‌నిపిస్తోంది.

కానీ సుమంత్ మార్కెట్ దృష్ట్యా ఆ బ‌డ్జెట్ రిస్కీనే. కానీ కంటెంట్ మీద న‌మ్మ‌కానికి తోడు ఒక యంగ్ స్టార్ క్యామియో (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అని ప్ర‌చారం జ‌రుగుతోంది) సినిమాకు ప్ల‌స్ అయి సినిమా మంచి స‌క్సెస్ అయి త‌న‌ను బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని నిర్మాత ఆశాభావంతో ఉన్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ ర‌ణ‌బాలి ఖాళీ చేసిన సెప్టెంబ‌రు 11 డేట్‌ను ఈ సినిమా విడుద‌ల కోసం టీం ఎంచుకుంది.