సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే రాజకీయ పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనే కాక బయట కూడా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు.
అయినా సరే కొందరు ఫిలిం మేకర్లు ఇన్ డైరెక్ట్‌గా పంచులు వేయడానికి వెనుకాడట్లేదు. కొన్ని సందర్భాల్లో అనుకోని కోయిన్సిడెన్స్‌ల ద్వారా కూడా సినిమాలకు పొలిటికల్ కలర్ యాడ్ అవుతోంది. గత వారం విడుదలైన రెండు కొత్త చిత్రాల్లోనూ తెలుగు రాజకీయాలతో కనెక్షన్ ఉన్న డైలాగులు, సీన్లు ఉండడం గమనార్హం.
రాజకీయాల్లోకి వెళ్లబోతూ విజయ్ తన చివరి సినిమాగా చేసిన ‘జననాయగన్’లో బోలెడన్ని పొలిటికల్ పంచ్‌లు ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రయోజనం ఆశించే విజయ్ ఈ సినిమా చేశాడు కాబట్టి తమిళ రాజకీయాలతో ముడిపడ్డ సన్నివేశాలు, డైలాగులకు లోటు లేదు. అందుకే ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు ఎదురై రిలీజ్ బాగా లేటైంది. ఐతే ఇందులో తెలుగు రాజకీయాలతో కనెక్ట్ అయ్యేలా ఒక సన్నివేశం, డైలాగ్ ఉండడం గమనార్హం.
ఇందులో హీరో విజయ్.. విలన్ అయిన ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేయగా.. అతణ్ని కలవడానికి ఇంకో విలన్ బాబీ డియోల్ వస్తాడు. మనిద్దరం కలిసి రాజకీయాల్లో ఎదుగుదాం అని ఆఫర్ చేస్తూ, నువ్వు సీఎం అవ్వు-నేను డిప్యూటీ సీఎం అవుతా అంటాడు బాబీ డియోల్. దీన్ని 2024 ఎన్నికల ముంగిట చంద్రబాబు జైలుపాలైతే పవన్ వెళ్లి కలవడంతో పోలుస్తున్నారు. తర్వాత ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం కావడం, పవన్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాన్ని వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుని.. చంద్రబాబు-పవన్‌లను విలన్లుగా చిత్రీకరిస్తూ ఆనందం పొందుతున్నారు.
మరోవైపు ‘చెన్నై లవ్ స్టోరీ’లోని ఒక సన్నివేశాన్ని టీడీపీ, జనసేన వాళ్లు సెలబ్రేట్ చేస్తుండడం గమనార్హం. ఇందులో కిరణ్ అబ్బవరం చేసిన హీరో పాత్ర పేరు స్టీవెన్ శంకర్. ఐతే నీ అసలు పేరేంటి అని హీరోయిన్ అడిగితే.. ‘దేవుడు’ అని బదులిస్తాడు హీరో. అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా అని అడిగితే.. ఒక పెద్ద మనిషిని పేరు పెట్టమని అంటే ‘దేవుడు’ అని పెట్టాడని హీరో చెబుతాడు.
వైసీపీ అధినేత జగన్.. గతంలో ఒక పర్యటనకు వెళ్లినపుడు ఒక జంట చిన్నారికి పేరు పెట్టమని అడిగితే ‘దేవుడు’ అని పేరుపెట్టి విపరీతంగా ట్రోల్ అయ్యాడు. ఆ ఉదంతాన్ని గుర్తు చేసేలా ‘చెన్నై లవ్ స్టోరీ’లో సన్నివేశం-డైలాగ్ పెట్టినట్లు కనిపిస్తోంది. థియేటర్లలో ఈ సీన్ వచ్చినపుడు జగన్ మావయ్యా అంటూ అరుపులు వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
