తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తమిళ స్టార్ ధనుష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనకు గతంలో నేషనల్ అవార్డులు రావాల్సినపుడు రాలేదని, అప్పుడు ఎవ్వరూ మద్దతుగా మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం విమర్శిస్తున్నారంటూ చేసిన వాదన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే జాతీయ అవార్డు విషయంలో ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. అతను ఏ కార్యక్రమంలో ఇలా మాట్లాడాడు, అసలక్కడ ఏం జరిగింది, ధనుష్ ఇంకా అక్కడ ఎలాంటి కామెంట్స్ చేశాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ధనుష్ తన అభిమానులతో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చాలా భారీగా హాజరైన అభిమానులతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వందల మంది అభిమానులు స్టేజ్ మీదికి రావడం.. ధనుష్‌కు పాదాభివందనాలు చేయడం, అతను వారిని ఆశీర్వదించడం విశేషం.
ఇక ధనుష్ మాట్లాడుతూ.. ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని, ఇలాంటి ఆకమత్యానికి ఒక శక్తి ఉందని.. దీనికి ఒక ప్రయోజనం ఉండాలని వ్యాఖ్యానించాడు. కేవలం ఆడియో వేడుకలు, కలయికలతో సరిపెట్టకుండా అందరూ కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని ధనుష్ పిలుపునిచ్చాడు.
మీ మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, చుట్టు పక్కల కుటుంబాలకు సాయపడాలని.. మిమ్మల్ని చూసి నేను గౌరవించాలని ధనుష్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, అభిమానులకు ఇచ్చిన సందేశాన్ని బట్టి చూస్తే.. మరో తమిళ హీరో రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. విజయ్ కూడా ఇలా అభిమానులను మొబిలైజ్ చేసి ముందుగా సేవా కార్యక్రమాలు చేయించి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను కూడా ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
