ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన ఒక హీరోతో సినిమాను మొదలుపెట్టి.. తర్వాత అతణ్ని తీసేయడం మాత్రం అరుదే. అల్లు అర్జున్ విషయంలో ఇలాగే జరిగిందని అంటున్నాడు సీనియర్ రైటర్ చిన్నికృష్ణ. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ‘గంగోత్రి’ సినిమాతో బన్నీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
ఐతే అంతకంటే ముందు టాలీవుడ్ లవ్ స్టోరీల చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటనదగ్గ ‘జయం’ సినిమాలో హీరో పాత్రకు బన్నీని తీసుకున్నాడట దర్శక నిర్మాత తేజ. కానీ ఏం జరిగిందో ఏమో.. కొన్ని రోజులకే అతణ్ని తప్పించి నితిన్‌ను తీసుకున్నాడట. ఈ విషయాన్ని చిన్నికృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
జయం సినిమాకు హీరోగా బన్నీని ఎంచుకున్నాక చిత్ర బృందం ఒక పార్టీ కూడా ఇచ్చాడని.. దానికి తాను కూడా హాజరయ్యానని.. కానీ రెండు మూడు రోజుల తర్వాత పేపర్లో ఈ సినిమాకు సంబంధించిన వార్తలో హీరోగా నితిన్ పేరు కనిపించడంతో తాను ఆశ్చర్యపోయినట్లు చిన్నికృష్ణ తెలిపాడు.
మరి బన్నీని తేజ ఎందుకు తీసేశాడన్నది తనకు తెలియదని చెప్పాడు. ‘జయం’ సినిమా బన్నీ చేజారడంతో అతడి అరంగేట్ర సినిమా కోసం తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటికే రజినీకాంత్ సినిమా ‘నరసింహ’కు కథ అందించిన తాను.. ఆయన నటించే మరో సినిమాకు పని చేయాల్సి ఉందని, కానీ బన్నీ కోసం ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుని మళ్లీ న్యూట్రల్ లోకి వచ్చి, ఫస్ట్ గేర్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చిందని చిన్నికృష్ణ వ్యాఖ్యానించాడు.
తన కథతో హీరోగా పరిచయం అయిన బన్నీ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండడం తనకు గర్వకారణమని చిన్నికృష్ణ చెప్పాడు. బన్నీ నటించిన ‘బద్రీనాథ్’ చిత్రానికి కూడా చిన్నికృష్ణే కథ అందించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates

