తెలుగు అమ్మాయి అదరగొట్టేసింది

అందం, అభినయం రెండూ ఉన్నా చాలా మంది తెలుగమ్మాయిలకు సినిమా అవకాశాలు రాక, తమ టాలెంట్ నిరూపించుకోలేక పక్క భాషలకు వెళ్లిన సందర్భాలు బోలెడున్నాయి. అందుకే ఆనందిని లాంటి వాళ్ళు తమిళంలో బిజీ అయ్యారు. ఎంతసేపూ ముంబై, బెంగళూరు, చెన్నై అంటూ ఇతర పరిశ్రమల హీరోయిన్ల మీద మక్కువ చూపే దర్శకులున్న ట్రెండ్ లో అచ్చమైన తెలుగు యువతికి అవకాశం దక్కడం, అందులో తన పెర్ఫార్మన్స్ తో మెప్పించడం ఖచ్చితంగా విశేషమే.

తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీలో నటించిన శ్రీగౌరీ ప్రియకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో తనది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. మందు తాగినట్టు నటించాలి, సీరియస్ గా పక్కవాళ్ళ మీద కోపంతో ఊగిపోతూ అరవాలి. వర్షంలో తడుస్తూ స్మశానంలో నిమిషాల తరబడీ డైలాగులు చెప్పాలి. ఎమోషన్లకు పెద్ద పీఠ వేసిన ఇలాంటి కథలో భావోద్వేగాలతో ఆకట్టుకోవాలి. డ్యూయెట్లు, గ్లామర్ షో లేని ఇలాంటి పాత్ర మాములుగా అయితే ఎవరికైనా సవాలే.

కానీ శ్రీగౌరి ప్రియా దాన్ని సమర్ధవంతంగా చేసి చూపించింది. చెన్నై లవ్ స్టోరీ కథ మొత్తం ఆమె మీదే నడుస్తుంది. ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ దాకా తను ఎన్నో రకాల షేడ్స్ చూపించే బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చింది. కామెడీకి స్కోప్ లేని తన క్యారెక్టర్ ని దర్శకుడు ఏ ఉద్దేశంతో అయితే డిజైన్ చేసారో దానికి అనుగుణంగానే పెర్ఫార్మ్ చేయడం చిన్న విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇంత స్కోప్ దక్కించుకున్న హీరోయిన్ లేరంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

శ్రీగౌరి ప్రియా కాకినాడ అమ్మాయి. గతంలో చిన్న చిన్న పాత్రల్లో కొన్ని తెలుగు సినిమాలు చేసింది కానీ మొదటి బ్రేక్ ‘మ్యాడ్’ రూపంలో దక్కింది. కాకపోతే అందులో క్యాస్టింగ్ ఎక్కువగా ఉండటంతో అందరూ క్రెడిట్ పంచుకున్నారు. తర్వాత తమిళంలో చేసిన ‘ట్రూ లవర్’ తెలుగు వెర్షన్ తీసుకొచ్చింది ఎస్కెఎనే. జివి ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ అంచనాలు అందుకోలేదు. అయితే ఇప్పుడీ చెన్నై లవ్ స్టోరీకి దక్కుతున్న అప్లాజ్ చూస్తుంటే ఇండస్ట్రీ శ్రీగౌరీ ప్రియా టాలెంట్ ని గుర్తించినట్టే ఉంది.