ఇవాళ ఎక్కడ చూసినా ది ఒడిస్సి తాలూకు ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ సినిమా ట్వీట్లతో టైం లైన్ నిండిపోతోంది. బాలేదన్న వాళ్ళు నూటికి అయిదుగురు ఉంటే మిస్ కావొద్దని చెబుతున్న వాళ్ళు తొంభై మంది ఉన్నారు. అంతగా రిలీజ్ కు ముందు నుంచే హైప్ తీసుకొచ్చిన ది ఒడిస్సీ తెలుగుతో పాటు ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో వచ్చేసింది. ఈ రోజు గంటకు 14 వేలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముతూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
ఇంతగా ఈ సినిమాలో ఏముందంటే తండ్రి కోసం కొడుకు పడే తాపత్రయం, భార్యా పిల్లలను చూసుకోవడం కోసం యుద్ధం అయిపోయాక ఒక వీరుడు చేసే ప్రమాదకర ప్రయాణం, రాజు లేని రాజ్యాన్ని పాలిస్తున్న ఒక మహిళ చుట్టూ చేరిన అరాచక శక్తుల విధ్వంసం, ప్రమాదాలు చుట్టుముడుతున్నా లెక్క చేయకుండా సముద్రంలో ప్రయాణం చేసే సైనికుల మనోస్థైర్యం ఇవన్నీ ది ఒడిస్సిలో ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్లు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి.
ఇంటర్ స్టెల్లార్, ఓపెన్ హెయిమర్ లాంటి స్లో డ్రామాలతో ఆడియన్స్ ని కట్టిపడేసిన క్రిస్టఫర్ నోలన్ ఈసారి కథనంలో మరీ అంత నెమ్మదితనం చూపించలేదు. తొలి అరంగంట కొంచెం స్లో అనిపించినా ఆ తర్వాత వేగం అందుకుంటుంది. ముఖ్యంగా ఒడిస్సితో పాటు ఉన్న సైనికుల గుంపు ఒక్కొకరుగా సముద్ర తీరాలు మారేకొద్దీ ప్రాణాలు కోల్పోయే సంఘటనలు షాకింగ్ గా ఉంటాయి. భీతి గొలిపే హారర్ ని తాను ఎంత బాగా హ్యాండిల్ చేయగలరో నోలన్ నిరూపిస్తారు.
అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ తరహాలో ది ఒడిస్సీ పిల్లలు ఎగబడే సినిమా కాకపోవచ్చు కానీ సగటు మూవీ లవర్స్ మాత్రం మిస్ చేయకూడని ఎక్స్ పీరియన్స్ గా నిలుస్తుంది. అందులోనూ టికెట్ ధరల పంచాయితీ లేకుండా చక్కగా రెగ్యులర్ ధరలతోనే ఉంది కాబట్టి పెట్టిన డబ్బులకు సంతృప్తి అయితే కలిగిస్తుంది. తెలుగు డబ్బింగ్ విషయంలో క్వాలిటీ మైంటైన్ చేశారు. చక్కగా అర్థమవుతుంది. మంచి స్క్రీన్ లో సౌండ్ ఎక్స్ పీరియన్స్ బెస్ట్ కావాలంటే చూసి ఎంచుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates