సూప‌ర్ సీక్వెల్… భ‌లే అట్రాక్ష‌న్

తెలుగులో కొన్నేళ్ల నుంచి న‌డుస్తున్న‌ పాత సినిమాల‌ రీరిలీజ్ ట్రెండు గురించి తెలిసిందే. బాలీవుడ్‌కూ ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా.. తుంబాడ్. రిలీజ్ టైంలో ఆశించిన స్పంద‌న తెచ్చుకోని ఈ చిత్రం.. రెండేళ్ల కింద‌ట రీరిలీజై రికార్డు స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ టైంలో రిలీజైన కొత్త సినిమాల‌ను కూడా వెన‌క్కి నెట్టి కొన్ని వారాల పాటు థియేట‌ర్ల‌ను క‌ళ‌క‌ళ‌లాడించింది.

ఫ‌స్ట్ రిలీజ్‌లో తుంబాడ్‌ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఓటీటీలో జనం దీన్ని బాగానే చూశారు. కాల క్రమంలో ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతే ఓటీటీలో చూసిన చాలామంది ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని ఫీలయ్యారు. ఆ ఫీడ్ బ్యాక్ మేకర్స్ వరకు చేరి.. రీ రిలీజ్‌ను చక్కగా ప్లాన్ చేసి సినిమాను వదిలారు. అద్భుత ఫ‌లితం వ‌చ్చింది.

దీంతో తుంబాడ్ మేక‌ర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. గ‌త ఏడాది మొద‌లైన స‌న్నాహాలు ఇప్పుడో కొలిక్కి వ‌చ్చాయి. తుంబాడ్ హీరో సోహ‌మ్ షా.. సీక్వెల్లో న‌టించ‌డ‌మే కాక‌, త‌నే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆదేశ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ఆల్రెడీ న‌వాజుద్దీన్ సిద్ధిఖి రూపంలో గొప్ప న‌టుడు తోడ‌య్యాడు. 

ఇప్పుడు ఇంకో పెద్ద అట్రాక్ష‌న్ యాడ్ అయింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన ఆలియా భ‌ట్ తుంబాడ్‌-2లో న‌టించ‌బోతోంది. మామూలుగానే తుంబాడ్‌-2లో ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్‌లో భారీ అంచలున్నాయి. ఇప్పుడు న‌వాజుద్దీన్ లాంటి గొప్ప న‌టుడు, ఆలియా లాంటి పెద్ద స్టార్ తోడ‌వుతుండ‌డంతో క్రేజ్ డ‌బుల‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. త్వ‌ర‌లోనే సెట్స్ మీదికి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని 2027 డిసెంబ‌రులో విడుద‌ల చేయ‌నున్నారు.