ల‌వ్ జిహాద్ ఆరోప‌ణ‌లు… భార్య మతమేంటో చెప్పిన ఆమిర్ ఖాన్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్య‌వ‌హారం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట 80వ ద‌శ‌కంలో రీనాద‌త్తాను పెళ్లాడిన ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. త‌ర్వాత 2005లో కిర‌ణ్ రావుతో ఆయ‌న‌కు వివాహం జ‌రిగింది. ఆమె నుంచి 2021లో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరు మ‌హిళ‌తో ఆయ‌న‌కు వివాహం జ‌రిగింది. 

ఈ పెళ్లిలో రీనా, కిర‌ణ్‌ల‌తో పాటు వారితో ఆమిర్ ఖాన్ కు క‌లిగిన పిల్ల‌లు కూడా పాల్గొన్నారు. ఐతే ముస్లిం అయిన ఆమిర్.. హిందూ మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకుని వ‌దిలేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నాడ‌ని.. ఇది ల‌వ్ జిహాదే అని ఆయ‌న మీద సామాజిక మాధ్య‌మాల్లో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్ రాణే ఇదే కామెంట్ చేశారు. దీనిపై ఆమిర్ తాజాగా స్పందించాడు.

త‌న వివాహాలు ఎంత‌మాత్రం ల‌వ్ జిహాద్‌లో భాగం కాద‌ని ఆమిర్ అన్నాడు. త‌న భార్య‌ల్లో ఎవ్వ‌రూ ఇస్లాం మ‌తంలోకి మార‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రీనా, కిర‌ణ్ ఇద్ద‌రూ పెళ్లి త‌ర్వాత కూడా హిందూ మ‌తంలోనే కొన‌సాగార‌న్నాడు. ఇక గౌరీ గురించి స్పందిస్తూ.. ఆమె అస‌లు హిందువే కాద‌ని, క్రిస్టియ‌న్ అని ఆమిర్ వెల్ల‌డించాడు. ఆమె అస‌లు మ‌తాచారాల‌ను పాటించ‌ద‌ని అన్నాడు. 

త‌న‌ది ఎంతో విశాల దృక్ప‌థం ఉన్న కుటుంబం అని.. త‌న ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు హిందువుల‌ను పెళ్లి చేసుకున్నార‌ని.. త‌న కుమార్తె కూడా హిందువునే పెళ్లాడింద‌ని.. త‌న క‌జిన్ మ‌న్సూర్ క్రిస్టియ‌న్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడ‌ని ఆమిర్ తెలిపాడు. ఇదిలా ఉండ‌గా.. గౌరీ ఇస్లాం మ‌తంలోకి మార‌లేదు కాబ‌ట్టి ఆమిర్ మూడో పెళ్లి చెల్ల‌దంటూ ముస్లిం పెద్ద‌లు ఫ‌త్వా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ఆమిర్ ఏమీ స్పందించ‌లేదు.