ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’  

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ కోవలోకే చేరుతోంది. జూలై 17 విడుదల కాబోతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ ఇంగ్లీష్, తెలుగుతో పాటు ప్రధాన ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ రూపంలో రాబోతోంది. హైదరాబాద్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఒక ప్రసాద్ మల్టీప్లెక్సులోనే ఆల్రెడీ పాతిక వేల టికెట్లు అమ్ముడుపోగా దేశవ్యాప్తంగా ప్రీమియం స్క్రీన్ల మొదటి రోజు టికెట్లు దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయాయి.

ఇంతగా ది ఒడిస్సీలో ఏముందనే సందేహం రావడం సహజం. అదేంటో చూద్దాం. ఇది హోమర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ట్రోజన్ యుద్ధం పది సంవత్సరాల పాటు కొనసాగాక ఇదాకా రాజు ఒడిస్సియస్ తన భార్యా కొడుకుని కలుసుకోవడం కోసం తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. కానీ అతని సముద్ర ప్రయాణం చాలా భీకరంగా ఉంటుంది. ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. ఇంకోవైపు తండ్రిని వెతుక్కుంటూ కొడుకు కూడా వస్తాడు. ఈ డ్రామానే ది ఒడిస్సీ.

ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ ఎంచుకున్న విధానం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేగా హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ముందు రాజు భార్య, కొడుకు వైపు నుంచి కథను మొదలుపెట్టి తర్వాత అసలు స్టోరీలోకి వస్తారు. సంఘటనలు ముందుకు వెనక్కు వెళ్తూ కొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే ఈ తరహా స్క్రీన్ ప్లే చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని అన్ని దేశాలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా నోలన్ ఎలా చెప్పారనేది తుది ఫలితాన్ని శాశించనుంది.

లక్కీగా ది ఒడిస్సీకి ఇండియాలో పెద్దగా కాంపిటీషన్ లేదు. అన్ని భాషల్లో సినిమాలు వస్తున్నాయి కానీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న బలమైన కంటెంట్ ఏదీ లేదు. దీంతో సహజంగా ది ఒడిస్సీకు మంచి ఓపెనింగ్ వస్తుంది. కంటెంట్ కనక కనెక్ట్ అయితే మాత్రం వసూళ్ల వర్షం ఖాయమని చెప్పొచ్చు. స్పైడర్ మ్యాన్ వచ్చేదాకా అడ్డుకట్ట పడకపోవచ్చు. కాకపోతే నోలన్ గత చిత్రం ఓపెన్ హెయిమర్ మన బిసి సెంటర్స్ లో అంతగా రీచ్ కాలేదు. మరి ది ఒడిస్సీ ఏం చేస్తుందో చూడాలి.