దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది భారీ మొత్తం కాకపోయినా జానర్ కున్న పరిమితులు చూసుకుంటే మంచి నెంబరే అని చెప్పాలి. సోమవారం బుక్ మై షోలో లెనిన్ టికెట్లు 75 వేల దాకా అమ్ముడుపోగా ఈవిల్ డెడ్ సుమారు 50 వేలకు దగ్గరగా వెళ్ళింది. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం పాతిక వేల టికెట్లే. దీన్ని బట్టి బాగానే కనెక్ట్ అయ్యిందనుకోవచ్చు.

ఒకప్పుడు ఈవిల్ డెడ్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉండేది. కానీ తర్వాత ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాయి. కానీ బర్న్ వాటికి భిన్నంగా భీతిగొలిపేలా తీశారు. భయంకరమైన హత్యలు, జుగుప్స కలిగించే సన్నివేశాలు, రక్తపాతం, దెయ్యాలు చేసే దారుణమైన పనులు వెరసి ఆడియన్స్ ని బాగా భయపెట్టాయి. హైదరాబాద్ లో ఆక్యుపెన్సీలు బాగుండగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు పలు జిల్లా కేంద్రాల్లో చెప్పుకోదగ్గ షోలే పడ్డాయి.

ఇంగ్లీష్ ఆత్మలు దెయ్యాలంటే భారతీయులకు కాస్త మోజు ఎక్కువే. ఆ మధ్య లీ క్రోనిన్ మమ్మి కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది. గత కొన్నేళ్లలో వచ్చిన ఈవిల్ డెడ్ భాగాలు, కాంజురింగ్, లాంగ్ లెగ్స్, బాక్ డోర్స్ లాంటివి నగర ప్రాంతాల్లో బాగానే ఆడాయి. భాష అర్థమైనా కాకపోయినా భయపడేందుకు సరిపడా ఎలిమెంట్స్ ఉండటంతో జనం వీటికి బాగానే వెళ్తున్నారు. జులాయిలో అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఎంఎస్ నారాయణ అన్నట్టు వీటిని చూడకుండా ఉండలేం.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఈషా లాంటి యావరేజ్ కంటెంట్ కూడా గత ఏడాది మంచి డబ్బులే తెచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. హారర్ లో కామెడీ ప్రవేశించాక సీరియస్ గా చెప్పే దర్శకులు తగ్గిపోయారు. రామ్ గోపాల్ వర్మ భూత్, రాత్రి తరహా సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం అయితే ఉంది. లారెన్స్ కాంచన 4 మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో దాని బిజినెస్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. 2027 ప్రథమార్ధంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.