మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు కూడా. తెలుగులోనూ పెద్ద పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నుంచి కూడా అతడికి ఆఫర్లు వస్తుండగా.. సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకంటున్నాడు. ఐతే ఇప్పట్లో అనిరుధ్‌ను కొట్టేవాడు రాడు అనుకుంటుంటే.. ఈ మధ్యే సాయి అభ్యంకర్ అనే యువ సంగీత దర్శకుడు వచ్చాడు. 

అనిరుధ్ ఎలా అయితే టీనేజీలోనే భారీ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడో అభ్యంకర్ కూడా అదే చేస్తున్నాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభంలోనే సూర్య లాంటి టాప్ స్టార్‌తో పని చేశాడు. అల్లు అర్జున్, అట్లీల మెగా మూవీ ‘రాకా’కు కూడా పని చేస్తున్నాడు. మున్ముందు అనిరుధ్‌కు గట్టి సవాలు విసిరే సంగీత దర్శకుడు అవతాడని అతడిపై అంచనాలున్నాయి.

ఇన్నాళ్లూ తమన్, దేవిశ్రీ ప్రసాద్, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్‌‌కు కొంచెం పోటీ ఇచ్చినా.. అతణ్ని బలంగా అయితే ఢీకొట్టలేకపోయారనే అభిప్రాయం ఉండేది. కానీ సాయి అభ్యంకర్ మాత్రం అనిరుధ్‌తో సై అంటే సై అని పోటీ పడడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఇలాంటి టైంలో వీరి మధ్య రసవత్తర పోటీకి రంగం సిద్ధమైంది. ఇద్దరూ ఒకే కథతో తెరకెక్కుతున్న వేర్వేరు సినిమాలకు పని చేయనున్నారు. తెలుగులో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఎంపికైతే.. తాజాగా తమిళంలో ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్లో రానున్న ‘తమిళ్ మురుగన్’ చిత్రానికి అభ్యంకర్ పని చేయనున్నాడు. 

ఇవి రెండూ సుబ్రహ్మణ్యస్వామి కథలతో తెరకెక్కనున్న చిత్రాలే. రెండూ ప్రెస్టీజియస్ మూవీసే కావడంతో సంగీతం కూడా ఎంతో కీలకం కానుంది. తమిళులు వ్యతిరేకిస్తున్న ‘గాడ్ ఆఫ్ వార్’కు సంగీత దర్శకుడిగా పని చేయడం అనిరుధ్‌కు కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. తమిళ ప్రేక్షకులు ఆటోమేటిగ్గా ‘తమిళ్ మురుగన్’ వైపు నిలబడి సాయి అభ్యంకర్‌కు ఎలివేషన్ ఇస్తారనడంలో సందేహం లేదు.

కోలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే సినిమాతో బలమైన ముద్ర వేయడానికి అభ్యంకర్ ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ‘గాడ్ ఆఫ్ వార్’కు అద్భుతమైన సంగీతాన్నందించి ఆ చిత్రాన్ని వేరే లెవెల్లో నిలబెట్టడానికి అనిరుధ్ ట్రై చేస్తాడు. మరి ఈ ఇద్దరి మధ్య ‘వార్ ఆఫ్ మ్యూజిక్‌’లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం.