తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్‌ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఇదే పని చేశాడు. తన ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమాకూ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించే నవీన్ నూలిని సైకో అన్నాడు. కాకపోతే ఇది కోపంతో అన్న మాట కాదు. తనతో ఉన్న చనువుతో అన్న మాట. లెనిన్ మూవీ సక్సెస్ మీట్‌లో నాగార్జున గొప్పదనం గురించి చెబుతూ.. నవీన్ నూలి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నాగవంశీ.
లెనిన్ మూవీకి నాగార్జున కూడా ఒక నిర్మాత అయినప్పటికీ.. ఆయన స్థాయికి అన్నీ తనకు అనుకూలంగానే చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. తమ కంఫర్టే చూశాడని నాగవంశీ కామెంట్ చేశాడు. మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసిన ఏ సినిమాకైనా అన్నపూర్ణ స్టూడియోలోనే ఎడిటింగ్ చేయిస్తారని.. కానీ లెనిన్ మూవీకి ఎడిటర్ నవీన్ నూలి మాత్రం తమ సితార ఆఫీస్‌లో కూర్చునే పని చేస్తానన్నాడని నాగవంశీ తెలిపాడు.
నవీన్ ఒక సైకో అని.. తనకు అలవాటైన కుర్చీ, తనకు ఎప్పుడూ టీ ఇచ్చే బాయ్.. ఇలా ప్రతిదీ తన కంఫర్ట్ మేరకే ఉండేలా చూసుకుంటాడని.. దీంతో నాగార్జున అతణ్ని డిస్టర్బ్ చేయకుండా సితార ఆఫీసుకే వచ్చి ఈ సినిమా ఎడిటింగ్ పనులు దగ్గరుండి చూసుకున్నారని చెప్పాడు నాగవంశీ.
లెనిన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నాగార్జున అన్నపూర్ణ కంటే సితార ఆఫీసులోనే ఎక్కువగా ఉన్నారని.. 20 రోజుల పాటు వరుసగా తమ ఆఫీసుకు వచ్చారని.. అలాగే రీ రికార్డింగ్ పనుల కోసం తమన్ దగ్గరికి వెళ్లారని.. డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ తనకు అలవాటైన విధంగానే పని చేసుకోనిచ్చారని నాగవంశీ తెలిపాడు. నాగార్జున స్థాయికి ఇలా చేయాల్సిన అవసరం లేదని.. కానీ అందరినీ ఇలా కంఫర్ట్‌గా ఉంచడంలోనే ఆయన పెద్ద మనిషో అర్థమైందని నాగవంశీ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates