శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా  

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్ తనే కాబట్టి. ఫస్ట్ లుక్ టీజర్ లో అఖిల్ తో పాటు ఆమె కూడా ఉంది. తర్వాత ఏవేవో పరిణామాల తర్వాత శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఇప్పుడు బెస్ట్ ఛాయస్ అనిపించుకుంది. ఒకవేళ శ్రీలీల అయ్యుంటే ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

కాసేపు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే శ్రీలీల నిజంగా లెనిన్ నుంచి తప్పుకోకుండా భారతిగా నటించి ఉంటే రిజల్ట్ ఏమీ మారేది కాదు. ఎందుకంటే ఇది హీరో డ్రివెన్ సబ్జెక్టు. తనకు ద్రోహం చేసిన అయినవాళ్ల మీద పగతో ఒక యువకుడు సాగించిన మారణకాండ ఈ కథ. స్టోరీలో మెయిన్ పాయింట్ భారతినే. అందులో సందేహం లేదు. కొన్ని మంచి సీన్లు పడ్డాయి. ఎమోషనల్ గా నటించే అవకాశం దక్కింది. అవన్నీ భాగ్యశ్రీ బోర్సే తన ప్రయత్న లోపం లేకుండా నిలబెట్టింది.

ఒకవేళ శ్రీలీల చేసినా తనను ఎలా ప్రెజెంట్ చేయాలనే దాని మీద దర్శకుడు కసరత్తు చేసేవారు. ఎందుకంటే ఆర్టిస్టుగా తనకు ఇప్పటిదాకా పెర్ఫార్మ్ చేయడానికి దక్కిన అవకాశాలు చాలా తక్కువ. పెళ్లి సందడి నుంచి గుంటూరు కారం దాకా అన్నింటిలో హీరోతో ప్రేమలో పడటం, డాన్సులు చేయడం మినహా చేసిందేం లేదు. పరాశక్తిలో నటనకు స్కోప్ దొరికినా కంటెంట్ వల్ల ఫెయిలయ్యింది. భగవంత్ కేసరిలో బాలయ్య ఎదురుగా మెప్పించడం చూశాంగా.

సో లెనిన్ లో చేసినా చేయకపోయినా శ్రీలీలకు ముందైతే సరైన కాంబోలు కథలు పడాలి. బాలీవుడ్ డెబ్యూ అంతకంత ఆలస్యమవుతోంది. కార్తీక్ ఆర్యన్ తో చేసిన సినిమా అసలు ఏ స్టేజిలో ఉందో ఎప్పుడు రిలీజవుతుందో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అయినా ఒక సినిమా జయాపజయాలు కేవలం హీరోయిన్ మీద ఆధారపడవు. హీరో దర్శకుడి తర్వాతే  మిగిలినవాళ్ళు కౌంట్ లోకి వస్తారు. అందుకే లెనిన్ విషయంలో శ్రీలీలని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.