అఖిల్ క‌దిలిపోయాడు… క‌దిలించేశాడు

టాలీవుడ్లో చాలామంది వార‌సులు స‌క్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొంద‌రికి ఆరంభం నుంచే క‌లిసొచ్చింది. కొంద‌రు కాస్త త‌డ‌బ‌డి నిల‌బ‌డ్డారు. కానీ అరంగేట్రానికి ముందే స్టార్ ఇమేజ్ సంపాదించి, విప‌రీత‌మైన హైప్ తెచ్చుకున్న అక్కినేని అఖిల్ మాత్రం తొలి సినిమా అఖిల్‌తో గ‌ట్టి ఎదురు దెబ్బ తిని, ఆ త‌ర్వాత కూడా ఆశించిన విజ‌యాలు అందుకోలేక ఇబ్బంది ప‌డ్డాడు. త‌న చివ‌రి చిత్రం ఏజెంట్ టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఆల్ టైం డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిల‌వ‌డంతో అక్కినేని అభిమానుల వేద‌న అంతా ఇంతా కాదు.

దీంతో త‌న‌ త‌ర్వాతి చిత్రం లెనిన్ విష‌యంలో అఖిల్‌తో పాటు నాగార్జున‌ ఎంతో జాగ్ర‌త్త ప‌డ్డారు. బాగా టైం తీసుకుని ఈ సినిమా తీశారు. ఎట్టకేల‌కు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అఖిల్ గ‌త చిత్రాలు వేటితో పోల్చుకున్నా ఇది బెట‌ర్ అన‌డంలో సందేహం లేదు. సూప‌ర్ హిట్ టాక్ రాక‌పోయినా.. వాచ‌బుల్ అన్న ఫీడ్ బ్యాక్ వ‌స్తుండ‌డంతో లెనిన్ బుకింగ్స్ బాగున్నాయి. ప్ర‌స్తుతానికి బాక్సాఫీస్ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానే ఉంది.

లెనిన్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి అఖిల్ చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాడు. శుక్ర‌వారం సాయంత్రం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నిర్వ‌హించిన‌ లెనిన్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌లో అఖిల్‌.. తండ్రి నాగార్జున‌తో క‌లిసి పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా అతను తీవ్ర భావోద్వేగంతో తండ్రి కాళ్ల మీద ప‌డ‌డం.. ఆ త‌ర్వాత లేచి నాగ్‌ను గ‌ట్టిగా కౌగిలించుకుని ఏడ‌వ‌డం.. నాగ్ కొడుకు వెన్ను త‌ట్ట‌డం.. కొన్ని క్ష‌ణాల పాటు ఇద్ద‌రూ అలాగే ఉండిపోవ‌డం.. ఆపై తండ్రి దండం పెట్టి క‌న్నీళ్ల‌ను తుడుచుకోవ‌డం.. ఇలా ఈ వీడియో అక్కినేని అభిమానుల‌ను ఎంతో ఎమోష‌న‌లైజ్ చేసేలా ఉంది.

అఖిల్ స‌క్సెస్ కోసం ఎంత‌గా వెయిట్ చేస్తున్నాడో.. లెనిన్ సినిమాకు ప్రేక్ష‌కుల స్పంద‌న అత‌డిని ఎంత ఉద్వేగానికి గురి చేస్తోందో చెప్ప‌డానికి ఈ వీడియో ఉదాహ‌ర‌ణ‌. లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప‌డ్డ క‌ష్టమంతా తెర‌పై క‌నిపించింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా లుక్ మార్చుకోవ‌డ‌మే కాదు.. పెర్ఫామెన్స్ విష‌యంలోనూ అత‌ను ఎంతో మెరుగ‌య్యాడు. అంతిమంగా ఈ సినిమా అఖిల్ కోరుకున్నంత పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి.