అభిమానికి అఖిల్ అనుకోకుండా ఫోన్ చేస్తే…


సెలబ్రెటీల నంబర్ దొరికితే అభిమానులు ఫోన్ చేసి ఎలా విసిగించేస్తారో అంచనా వేయొచ్చు. గతంలో నందమూరి బాలకృష్ణకు ఒక ఫ్యాన్ కాల్ చేసినప్పటి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఒక హీరో.. ఒక మామూలు సినీ అభిమానికి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే చాలా చిత్రంగా అనిపిస్తుంది కదా.

తన కొత్త సినిమా ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొంటున్న అక్కినేని అఖిల్.. ఇలాంటి చిలిపి పనే చేశాడు. ‘లెనిన్’లో తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న గెటప్ శీనుతో కలిసి అఖిల్.. రాండమ్‌గా ఒక వ్యక్తికి కాల్ చేశాడు. అప్పుడు అతడి స్పందన ఎలా ఉందో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సందర్భంగా అవతలి వ్యక్తి ఇచ్చిన రియాక్షన్లకు అఖిల్, శీను ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. ఆ వీడియో చూస్తే ఎవ్వరైనా నవ్వాపుకోవడం కష్టం.

కాల్ చేసి నేను అక్కినేని అఖిల్ మాట్లాడుతున్నా అనగానే.. అవతలి వ్యక్తి ‘‘నేను అక్కినేని నాగార్జున మాట్లాడుతున్నా’’ అని రెస్పాన్స్ ఇచ్చేసరికి అఖిల్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థిత తలెత్తింది. తర్వాత నిజంగానే నేను అఖిల్‌ను మాట్లాడుతున్నా అని అక్కినేని కుర్రాడు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా.. అవతలి వ్యక్తి వినిపించుకోలేదు. మధ్యలో అక్కినేని నాగేశ్వరరావును ఇమిటేట్ చేస్తూ వెటకారమాడాడు. మధ్యలో గెటప్ శీను ఫోన్ తీసుకుని.. తన పేరు చెప్పి, నీకు ఫోన్ చేసింది అఖిలే అని చెప్పినా అతను నమ్మలేదు.

పైగా ‘‘నేను సుడిగాలి సుధీర్ మాట్లాడుతున్నా.. ఏంటి ఈ మధ్య జబర్దస్త్‌కు రావట్లేదు. నాకూ జబర్దస్త్‌లో ఛాన్స్ ఇప్పించు’’ అంటూ వెటకారమాడాడు. చివరికి ‘‘నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నమ్ముతాను. అక్కినేని అఖిల్ దగ్గర నా నంబర్ ఎందుకుంటుంది. అంత పెద్ద వ్యక్తి నాకెందుకు ఫోన్ చేస్తాడు’’ అంటూ లాజిక్కులు తీశాడు. రాండమ్‌గా నీ నంబర్‌కు కాల్ చేశాం అన్నా కూడా అతను వినిపించుకోపోవడంతో అఖిల్, శీను గట్టిగా నవ్వుకుని కాల్ కట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.