హృదయం మురళి వెనుక తండ్రి కథ

జూలై 10 విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రస్తుతానికి హృదయం మురళి తక్కువ సౌండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న అసలైన ఎమోషన్ 90స్ కిడ్స్, యువతకు తెలుసు. అదేంటో చూద్దాం. హీరో అధర్వ తండ్రి మురళి ఒకప్పుడు క్రేజ్ ఉన్న హీరో. తెలుగులో హృదయం సూపర్ హిట్ అయ్యాక ఆయన సుపరిచితుడయ్యారు. తర్వాత నువ్వే నా ప్రేయసి లాంటి హిట్స్ ద్వారా మరింత దగ్గరయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్ టైం కాబట్టి మనోళ్లకు ఎక్కువ రీచ్ కాలేదు.

తమిళంలో మురళికి మంచి పేరుంది. ఎన్నో సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా భగ్న ప్రేమికుడిగా చేసే నటనకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండేది. 2010లో ఆయన చనిపోయే దాకా యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. మురళి వారసుడిగా వచ్చిన అధర్వ తండ్రిలాగా చిన్నగా పేరు పెంచుకునే పనిలో ఉన్నాడు. తెలుగులో గద్దలకొండ గణేష్ తో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ తర్వాత కోలీవుడ్ కే పరిమితమయ్యాడు.

మన ప్రేక్షకులకు హృదయం మురళి ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అయితే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ కావడం ఒకటైతే చాలా గ్యాప్ తర్వాత తమన్ ఫుల్ లెన్త్ రోల్ లో నటించడం మరొకటి. పాటలు కూడా మెల్లగా మ్యూజిక్ లవర్స్ కు ఎక్కేస్తున్నాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్సే కనిపిస్తోంది. పోటీలో ఐ నో బడి, లెనిన్ ఉండటంతో హృదయం మురళి టాక్ అండ్ రివ్యూస్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది.

కాకతాళీయంగా అధర్వ డెబ్యూ చేసిన సంవత్సరమే మురళి కన్ను మూశారు. అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు చేస్తున్న టైంలో ఇలా దూరం కావడం ఫ్యాన్స్ ని బాధించింది. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్న అధర్వకు మరో సెంటిమెంట్ కూడి వస్తోంది. హృదయం లాంటి కల్ట్ క్లాసిక్ సినిమా టైటిల్, దానికి తన తండ్రి పేరు జోడించి అందులో హీరోగా నటించడం స్పెషల్ గా ఫీలవుతున్నాడు. మరి ఫలితం కూడా దానికి తగ్గట్టే వస్తే సినీ ప్రియులకు అంతకన్నా హ్యాపీ ఏముంటుంది.