యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నటిగా మంచి స్థాయికి చేరుకున్న తెలుగమ్మాయి స్వాతి మళ్లీ పెళ్లికూతురైంది. తొలి వివాహం విఫలమయ్యాక కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఆమె.. ఇప్పుడు యువ దర్శకుడు శ్రీకాంత్ నగోతితో ఏడడుగులు వేసింది. తమ ప్రేమ గురించి ఇన్ని రోజులు సీక్రెట్‌గా ఉంచిన జంట.. నేరుగా పెళ్లి కబురును పంచుకుంది.
ఓటీటీ ఫిలిం భానుమతి-రామకృష్ణతో శ్రీకాంత్ నగోతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలతో దర్శకుడిగా శ్రీకాంత్ తన అభిరుచిని చాటి మంచి పేరు సంపాదించాడు. మంత్ ఆఫ్ మధు చిత్రానికి పని చేస్తున్న సమయంలో మొదలైన స్వాతి, శ్రీకాంత్ పరిచయం తర్వాత ప్రేమగా మారింది.
వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు రెడిట్‌లో ముందు నుంచే రూమర్లు వచ్చాయి. కానీ ఎక్కడా మీడియా కంట పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. తమ ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరగకుండా చూసుకుంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తను సోషల్ మీడియాలో పంచుకుంది.
కలర్స్ ప్రోగ్రాంతో టీవీ యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ ప్రోగ్రాం పేరునే ఇంటిపేరుగా మార్చుకుంది స్వాతి రెడ్డి. ఆ ప్రోగ్రాంలో క్యూట్ క్యూట్ మాటలతో యువతను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత డేంజర్ సినిమాతో నటిగా మారిన ఆమె.. ఆపై హీరోయిన్ అయింది. తెలుగులో స్వామిరారా, కార్తికేయ సహా పలు చిత్రాల్లో నటించిన స్వాతి.. ఒక దశలో తమళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సుబ్రహ్మణ్యపురం సహా పలు తమిళ చిత్రాల్లో ఆమె నటించింది.
కెరీర్ మంచి ఊపుమీదుండగానే వికాస్ వాసు అనే మలయాళీ పైలట్‌ను పెళ్లాడి థాయ్‌లాండ్‌లో సెటిలైన సంగతి తెలిసిందే. కానీ కొన్నేళ్లకే భర్తతో విభేదాలు వచ్చి అతడి నుంచి విడిపోయిన స్వాతి.. హైదరాబాద్‌కు తిరిగొచ్చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే మంత్ ఆఫ్ మధు సినిమా చేయడం, శ్రీకాంత్‌తో ప్రేమలో పడి అతణ్ని పెళ్లాడడం జరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates