సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బోలెడన్ని అవకాశాలు అందుకుని.. చాలా ఏళ్ల పాటు ఇక్కడ కెరీర్‌ను నడిపించి.. బాగా డబ్బులు సంపాదించిన ఉత్తరాది కథానాయికలు.. ఇక్కడ కెరీర్ ముగిశాక వెళ్లి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ దక్షిణాది చిత్రాలను తక్కువ చేసి మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. గతంలో ఇలియానా, తాప్సి… ఈ మధ్య తమన్నా ఇలాగే మాట్లాడి అన్ పాపులర్ అయ్యారు.
సౌత్‌లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌గా చూపిస్తారన్నట్లు.. బాలీవుడ్లో మాత్రం మహా గొప్ప పాత్రలు చేయిస్తారన్నట్లు వీళ్లు మాట్లాడ్డం విడ్డూరమే. తమను స్టార్ హీరోయిన్లను చేసిన సౌత్ ఇండస్ట్రీ పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అలా మాట్లాడడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా. మన ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడి.. తెలుగు వారి మనసులు దోచుకుంటోంది సోనాలి బింద్రే.
ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో ఇంద్ర, మురారి, మన్మథుడు లాంటి పెద్ద హిట్లలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సోనాలి… తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపించింది. ఇక్కడ తాను పని చేసే రోజుల్లో ప్రొఫెషనలిజం ఎక్కువ అని.. బాలీవుడ్లో సెట్‌కు వచ్చాక కరెక్షన్లు చేయడం, డైలాగులు రాయడం ఉండేదని.. కానీ తెలుగులో మాత్రం బౌండెడ్ స్క్రిప్టులతో షూటింగ్‌కు వచ్చి సన్నివేశాలు తీసేవారని ఆమె అంది.
ఇక తెలుగు సినిమాల రేంజ్ గురించి మాట్లాడుతూ.. పెద్ద బడ్జెట్లలో, భారీ స్థాయిలో సినిమాలు తీసేవారని.. అక్కడి సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు చిన్నబోయేవని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. తాను పని చేసిన సినిమాలకు నిర్మాతలు చాలా మంచి ఫుడ్ పెట్టేవారని.. హైదరాబాద్ ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేసేదాన్నని.. దేశ విదేశాల్లో తెలుగు సినిమాలు భారీ స్థాయిలో రూపొందేవని ఆమె పేర్కొంది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఇంత కృతజ్ఞతతో మాట్లాడిన సోనాలిని చూసి తమన్నా లాంటి వాళ్లు పాఠాలు నేర్వాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates