బంగారం నవ్వులు… అల్ఫా నవ్వులపాలు

గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న ‘మా ఇంటి బంగారం’ వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా అందుకునేలా ఉంది. ఓవర్సీస్ లో రెండు మిలియన్ మార్క్ దాటాడం ద్వారా సమంత తన సత్తా చాటింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇంత వసూలు చేస్తుందాని అగ్ర నిర్మాతలే ఆశ్చర్యపోయేలా చేయడం గురించి పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ రన్ దగ్గరవుతున్న టైంలోనూ వీకెండ్ హౌస్ ఫుల్స్ పెట్టడం అంత ఈజీగా జరిగే పని కాదు.

సరే టాలీవుడ్ లో ఒక లేడీ మూవీ ఇంత అద్భుతం చేసింది కదా బాలీవుడ్ మేమేం తక్కువని ఋజువు చేయడం కోసం మొన్న అల్ఫా థియేటర్లలో అడుగు పెట్టింది. నెగటివ్ రివ్యూలు, విమర్శలతో సోషల్ మీడియా తడిసిపోయింది. స్పై యునివర్స్ ని నాశనం చేయడానికే తీశారని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అలియా భట్ కష్టపడింది కానీ అత్తెసరు కంటెంట్ లో ఆమెకు గుర్తింపు రాకుండా పోయింది. యుఎస్ లో మిలియన్ రావడమే గొప్పని అంటున్నారు. ఓవరాల్ గా వంద కోట్లు కల్లో మాటే.

అంటే ఒక భాషకే పరిమితమైన మా ఇంటి బంగారం దరిదాపుల్లో అంత పెద్ద యాక్షన్ మూవీ రాలేకపోయింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే రెండింటి మధ్య బోలెడు వ్యత్యాసం ఉంది. సమంత టీమ్ చాలా తెలివిగా ఖర్చుని కంట్రోల్ చేసుకుని మంచి సబ్జెక్టుతో రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ దాటేశారు. కానీ అల్ఫా అలా కాదు. విపరీతంగా ఖర్చు పెట్టేశారు. తెరమీద చూస్తే ఇన్ని వందల కోట్లు పెట్టింది ఈ స్క్రిప్ట్ కోసమా అనిపించేలా నీరసం తెప్పించేసింది.

సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంత పెట్టాం, ఎన్ని హంగులు ఉన్నాయనేది కాదు. జనాలకు అర్థమయ్యేలా మన సినిమా ఉందా లేదాని. తలతిక్క యాక్షన్ లేకుండా చూసుకుంటే మాస్ క్లాసు ఇద్దరూ ఆదరిస్తారని మా ఇంటి బంగారం ఋజువు చేయగా, నేలవిడిచి సాము చేసే హీరోయిజంకు కాలం చెల్లిందని అల్ఫా నిరూపించింది. ఈ రెండూ కేవలం నెల రోజుల వ్యవధిలో రావడం గమనార్హం. ఆల్ఫా ఫలితం తెలిశాక పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు ఆపేయడం అసలు ట్విస్టు.