చరణ్ మెచ్చుకున్న సినిమాలో ఏముంది

దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా పెట్టడంతో మూవీ లవర్స్ కి దీని మీద ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ లో తనకు జోడిగా నటించిన అలియా భట్ అల్ఫా గురించి రిలీజయ్యాక ట్వీట్ చేయని మెగా పవర్ స్టార్ ఇప్పుడు క్యాస్టింగ్ పరంగా ప్రత్యేకత లేని సినిమాను మెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫ్యాన్స్ ఈయన ఇంత ప్రత్యేకంగా పొగిడాడంటే అందులో ఏముందోనని వెతకడం మొదలుపెట్టారు.

ఇదో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. బేబీ (హ్యూమా ఖురేషి) అనే స్త్రీ మూగ ప్లస్ చెవిటి. అయినా తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హత్యలు చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు సోదరి హత్యను కళ్లారా చూడటంతో ప్రతీకారం కోసం వెయిట్ చేస్తుంటుంది. జాఫర్ అనే మాఫియా డాన్ కోసం పని చేస్తుండగా అనుకోకుండా అతని గ్యాంగ్ లో ఒకడు ఈమె వల్ల చనిపోతాడు. పెళ్లి చేసుకుని ఈ జీవితం వదిలేద్దాం అనుకున్న టైంలో జరిగిన ఈ సంఘటన తర్వాత బేబీ లైఫ్ ఏమయ్యిందనేది స్టోరీ.

కంటెంట్ పరంగా చూసుకుంటే ఒక డిఫరెంట్ టోన్ లో దీన్ని తెరకెక్కించారు దర్శకుడు సచికేత్ సామంత్. ముంబై అండర్ వరల్డ్ ని చూపించిన విధానం కొత్తగా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత బిగితనం సెకండాఫ్ లో తగ్గిపోవడంతో పాటు ట్విస్టులు ఊహించినట్టు జరగడం థ్రిల్ ని తగ్గించేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ రొటీన్ గా ఎండ్ కావడం కొంత నిరాశ పరుస్తుంది. అయితే భరించలేనంతగా స్క్రీన్ ప్లే లేకపోవడం ప్లస్ పాయింట్.

చరణ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా చూడాల్సిన లిస్టులో బేబీ దో డై దో చేర్చుకోవచ్చా అంటే మీరా జానర్ ప్రేమికులు అయితే ట్రై చేయొచ్చు. మరీ కొత్తదనం అనిపించదు కానీ రెగ్యులర్ స్టార్ హీరోల యాక్షన్ థ్రిల్లర్స్ బోర్ కొట్టినవాళ్లకు కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. హ్యూమా ఖురేషితో పాటు సికందర్ ఖేర్, చుంకీ పాండేల నటన ఆకట్టుకుంది. మరీ విపరీతమైన అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే కానీ అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. అల్ఫా, వెల్కమ్ టు ది జంగల్ కంటే బెటరే.