తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు విష్ణు విశాల్. ఆ గుర్తింపుకి తోడు.. రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉండడం వల్ల కొన్నేళ్ల ముందు అతను నటించిన ఫ్యామిలీ సినిమా ‘గట్టా కుస్తీ’ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదల చేస్తే కొంచెం క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది. ఇలాంటి యావరేజ్ మూవీకి సీక్వెల్ చేయడం అరుదు.
కానీ విష్ణు విశాల్ అండ్ టీం ‘గట్టా కుస్తీ-2’ తీసి ఆశ్చర్యపరిచింది. గత శుక్రవారం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది ఈ సినిమా. దీనికి గొప్ప రివ్యూలేమీ రాలేదు. ‘గట్టా కుస్తీ-1’తో పోలిస్తే కామెడీ వరకు బెటర్ అన్నారే తప్ప.. యావరేజ్ మూవీ అనే తీర్మానించారు క్రిటిక్స్. కొన్ని ఇంగ్లిష్ వెబ్ సైట్స్ 2 అంతకంటే లోపే రేటింగ్స్ ఇచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలకు పట్టం కడుతున్న తమిళ ప్రేక్షకులు.. దీన్ని కూడా బాగా ఆదరిస్తున్నారు.
తొలి రోజు వసూళ్లతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు 75 శాతం పెరిగాయంటే.. ‘గట్టా కుస్తీ-2’ ఎలా జనాల్లోకి చొచ్చుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఈ చిత్రం తమిళనాడులోని మేజర్ సిటీస్‌లో ప్యాక్డ్ హౌస్‌లతో రన్ అయింది. వీకెండ్లో ‘గట్టా కుస్తీ-2’కు రూ.16 కోట్ల దాకా కలెక్షన్లు వచ్చాయి. విష్ణు విశాల్ స్థాయికి ఇది చాలా పెద్ద నంబరే. సెకండాఫ్‌లో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి మధ్య వచ్చే కుస్తీ ఫైట్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఫలితం ఎలా ఉంటుందో నెలన్నర కిందట ‘బ్లాస్ట్’ మూవీ రుజువు చేయగా.. ‘గట్టా కుస్తీ-2’ ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ‘మట్టి కుస్తీ’ని తెలుగు వాళ్లు పెద్దగా పట్టించుకోలేదనో ఏమో.. సీక్వెల్‌ను తెలుగులోకి అనువదించలేదు. కానీ తమిళంలో వస్తున్న రెస్పాన్స్ చూశాక రెండు వారాలు లేటుగా అయినా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. లేదంటే ఓటీటీలో రిలీజైనపుడు తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తారేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates