సమంత కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజై 20 రోజులు కావస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో వీకెండ్ తర్వాత నిలబడలేకపోతున్నాయి. పెద్ది సినిమాకు సైతం అనుకున్న మోతాదులో లాంగ్ రన్ సాధ్యం కాలేదు. కానీ అంత పెద్ద సినిమా జోరుకు బ్రేక్ వేయడమే కాదు.. మూడో వీకెండ్లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది సమంత సినిమా. గత వారం అంటే చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు కాబట్టి ‘మా ఇంటి బంగారం’ సెకండ్ వీకెండ్లో కూడా డామినేషన్ చూపించిందంటే ఓకే అనుకోవచ్చు.
కానీ ఈ వారం ‘నాగబంధం’, ‘రావు బహదూర్’ లాంటి సినిమాలు రిలీజైనా.. వాటి పోటీని తట్టుకుని సమంత సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ‘నాగబంధం’ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ‘మా ఇంటి బంగారం’ ఉండడం విశేషం. ‘రావు బహదూర్’ మూడో స్థానంలో ఉంది. బుక్ మై షోలో టికెట్ల అమ్మకాల ట్రెండ్ గమనిస్తే ఆర్డర్ ఇలాగే ఉంది.
‘నాగబంధం’ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాంతో పోలిస్తే ‘రావు బహదూర్’ బెటర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మాస్ ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం ఆకర్షించలేకపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ రెండు కొత్త సినిమాలతో పోలిస్తే పాత చిత్రమైన ‘మా ఇంటి బంగారం’కే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో మూడో వీకెండ్లోనూ ‘మా ఇంటి బంగారం’కి మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి.
సమంత సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యుఎస్‌లో ఈ సినిమా అద్భుత ఘనత సాధించింది. ఈ చిత్రం అక్కడ 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. నాన్ థియేట్రికల్ హక్కుల నుంచే పెట్టుబడి రాబట్టుకున్న ‘మా ఇంటి బంగారం’ టీంకు థియేటర్ల వస్తున్నదంతా లాభమే కావడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
