ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. కథేంటో ఎవరికీ తెలియదు. క్యాస్టింగ్ లో ఎవరెవరున్నారో టీమ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కేవలం ఒక పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గాడ్ ఆఫ్ వార్ ( ప్రచారంలో ఉన్న టైటిల్ ) వివాదంలోకి వచ్చేసింది. మురుగన్ దేవుడు తమిళనాడు స్వంతమని ఆయన మీద ప్రకటించిన చిత్రాన్ని వెంటనే ఆపేయాలని తమిళనాడు మాజీ ప్రజా ప్రతినిధి, కోలీవుడ్ నిర్మాత సీమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.
నిజానికి ఈ కాంట్రవర్సీ పోస్టర్ వచ్చిన మొదటి గంటలోనే పలు తమిళ హ్యాండిల్స్ నుంచి వచ్చేసింది. తర్వాత సైలెంట్ అయ్యారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో మురుగన్ ఉత్తరాదిలో పుట్టాడని ప్రస్తావించడం అసలు రచ్చకు కారణమయ్యింది. విచిత్రం ఏమిటంటే దేవుడికి రాష్ట్రాల సరిహద్దులు పెట్టడం. అలా అయితే రాయలసీమలో ఉన్న మంత్రాలయ రాఘవేంద్రస్వామిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకు నటించినట్టు. శ్రీ షిరిడి సాయిబాబా మహత్యంలో టైటిల్ రోల్ పోషించిన విజయ్ చందర్ కులం, రాష్ట్రం ఏ మూవీ లవర్ కి తెలియదు. నటులకు సరిహద్దులు ఉండవు.
అంతెందుకు తిరుపతికి నిత్యం లక్షలాది భక్తులు తమిళనాడు నుంచి వస్తారు. మా రాష్ట్రం కాదని రాకుండా ఉండొచ్చు. అక్కడే అరుణాచలం, పళని లాంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్లొచ్చు. కానీ దైవానికి భేదాలు ఉండవు కాబట్టే అమెరికాలోనూ ఏడుకొండల వాడి గుడి ఉంటుంది. లండన్ భారతీయుల ఇళ్లలో పూజలు జరుగుతాయి. ఇంత సింపుల్ విషయాలు మర్చిపోయి ఏదో కొంప మునిగిపోతుందన్న రేంజ్ లో హడావిడి చేయడం కరెక్ట్ కాదు.
కనీసం టీజర్ వచ్చి ఉంటే ఏదో అనుకోవచ్చు. సెట్స్ కు వెళ్లకముందే ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదనేది తారక్ అభిమానుల కామెంట్. వీటి పట్ల త్రివిక్రమ్ ఇప్పుడప్పుడే స్పందించకపోవచ్చు. ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ టైంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే అడిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఆయనకా అలవాటు లేకపోవడం వల్ల ఈ సందేహం అంత సులభంగా తీరకపోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల టైంలో ఇంకెలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
